
చిరంజీవి ఇప్పటికయితే దాదాపు రాజకీయాలను వదిలేసినట్లే... ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాలకు సమయం కేటాయించడం లేదు. కాక పోతే కాంగ్రెస్ రాజ్య సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు ఆయనను కాంగ్రెస్ రాజ్యసభకు తీసుకుంది. ఆపైన కేంద్రం లో మంత్రయ్యారు. ఇపుడు ఆయన రాజ్యసభ పదవీకాలం దగ్గిర పడుతున్నది. వచ్చే ఏప్రిల్ తో ముగుస్తుంది. అపుడు మళ్లీ ఆంధ్ర నుంచి రాజ్యసభకు వెళ్లడం కుదరదు. కాంగ్రెస్ కు అంతశక్తి లేదు. మరి రాజకీయ భవితవ్యం ఏమిటి?
తాజాగా వినవస్తున్న వార్తల ప్రకారం, చిరంజీవిని తెలుగుదేశం, వైసిసి- రెండూ- తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయట. రెండు పార్టీలు ఆయనను రాజ్యసభ కు పంపేందుకు సిద్ధంగా ఉన్నాయట. ఎటొచ్చి ఆయనే ఇంకా ఏమీ చెప్పలేదని చిరంజీవితో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నాయకులొకరు చెప్పారు. చిరంజీవి ఇపుడు బ్రిటిష్ వాళ్లను ఎదిరించిన కర్నూలు జిల్లా పాలెగార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద సినిమా తీస్తున్నారు. ఈ చిత్రం పేరు సైరా... ‘సైరా నరసింహారెడ్డి ’ అనే జానపద గీతంనుంచి ఈ టైటిల్ ను ఎన్నుకున్నారు. ఈ సినిమా పెద్ద సంచలనం అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా చిరంజీవిని మళ్లీ ఒక రాజకీయ శక్తిగా నిలుపుతుందని, ఆయనకు రాజకీయ పునర్జన్మ నిస్తుందని ఆయన కాంగ్రెస్ మిత్రులు కూడా నమ్ముతున్నారు. ఈ సినిమా ఇంచుమించుకు 2019 ఎన్నికలకు ముందు పెద్ద కలకలం సృష్టిస్తుందని ఆపుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తాడని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, వైసిపి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేసినా చిరంజీవి స్పందిచకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
అయితే, చిరంజీవి రాజకీయంగా అజాత శత్రువు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినా ఆయనెపుడూ వ్యక్తుల మీద దాడి చేయలేదు. మరొక విధంగా గిట్టని వారుండవచ్చే మే గాని రాజకీయంగా ఆయనకు ప్రత్యర్థులు లేరు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది.