ఆగస్టు 15న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

First Published Aug 7, 2017, 4:53 PM IST
Highlights
  • శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగస్టు 15వ తేదీన గోకులాష్టమి వేడుకలు
  • గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం.

 

 

 టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగస్టు 15వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.

 

శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టిటిడి హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏడాదీ అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.

 

సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టిటిడి శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూలమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గోవును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం. కావున టిటిడి సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

 

గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6 గంటలకు వేణుగానం, ఉదయం 6.30 గంటలకు వేద పఠనం, ఉదయం 7.30 గంటలకు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. అనంతరం శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

click me!