ప్రోటెం స్పీకర్: కాంగ్రెసుకు సుప్రీంకోర్టు పెట్టిన మెలిక ఇదీ...

First Published May 19, 2018, 11:48 AM IST
Highlights

ప్రోటెం స్పీకర్ గా కెజీ బోపయ్య నియామకాన్ని రద్దు చేయాలనే కాంగ్రెసు తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదనకు ప్రతిస్పందిస్తూ సుప్రీంకోర్టు మెలిక పెట్టింది.

న్యూడిల్లీ: ప్రోటెం స్పీకర్ గా కెజీ బోపయ్య నియామకాన్ని రద్దు చేయాలనే కాంగ్రెసు తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదనకు ప్రతిస్పందిస్తూ సుప్రీంకోర్టు మెలిక పెట్టింది. అలా చేయాలంటే బోపయ్యకు నోటీసు జారీ చేయాల్సి ఉంటుందని, అలా జారీ చేస్తే బలపరీక్షను వాయిదా వేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించేంత వరకు బోపయ్య ఉంటే ఫరవా లేదని, బలపరీక్ష సమయంలో మాత్రం ఉండకూడదని, గతంలో 2010లో బోపయ్య ప్రోటెం స్పీకర్ గా యడ్యూరప్పకు సాయం చేశాడని, అందువల్ల ఆయన నిజాయితీగా వ్యవహరిస్తారనే నమ్మకం లేదని కాంగ్రెసు వాదించింది. గతంలో బోపయ్య మెజారిటీని మానుప్యులేట్ చేశారని కపిల్ సబిల్ అన్నారు. 

జూనియర్ ను ప్రోటెం స్పీకర్ గా నియమించిన సందర్భాన్ని తనతో పాటు కపిల్ సిబల్ సమర్థిస్తూ వాదించామని బిజెపి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు. దీర్షకాలిక సంప్రదాయాన్ని కాదని బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్ గా నియమించారని, రెండు తీర్పుల్లో అటువంటి సందర్భాన్ని సుప్రీంకోర్టు సరిదిద్దిందని కపిల్ సిబల్ చెప్పారు. 

ప్రోటెం స్పీకర్ గా బోపయ్యనే యడ్యూరప్ప బలపరీక్షను నిర్వహిస్తారని, అయితే అన్ని  టీవీ చానెళ్లలో దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశిస్తామని, దాని వల్ల పారదర్శకత చోటు చేసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. 

తన నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రోటెం స్పీకర్ బోపయ్య ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం ప్రారంభించారు. 

click me!