
ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేసిన కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జైలు జీవితం గురించిన సమాచారాన్ని అధికారులు బయటపెట్టారు. డేరా బాబాకు అందించే ఆహారాన్ని ముందుగా పరిక్షించి.. ఆ తర్వాత ఆయనకు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ఆహారం సాంపిల్స్ ని 48గంటల పాటు నిల్వ ఉంచుతున్నారు. అంతేకాకుండా.. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీడియో తీస్తున్నట్లు చెప్పారు.
డేరాబాబాకు జైలుకి వెళ్లి నెల రోజులు కావస్తోంది. ఆయనకు లైఫ్ థ్రెట్ ఉన్న కారణంగా పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అతని ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయనకు అందించే ఆహారంలో ఎవరైనా విషం కలిపే ప్రమాదం ఉంది కనుక.. సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆ వీడియోలను కూడా వారం రోజుల పాటు దాచిపెడుతున్నామన్నారు. ఈ భద్రతా ఏర్పాట్లన్నింటినీ కేపీ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
డేరా బాబా తనను ఉంచిన బ్యారక్ లో తిరగవచ్చని.. అక్కడి ఇతర ఖైదీలతో కూడా మాట్లాడవచ్చని అధికారులు తెలిపారు. కాకాపోతే.. తన బ్యారక్ నుంచి మాత్రం బయటకు రావడానికి వీలు లేదని వారు చెప్పారు. అదేవిధంగా తన బ్యారక్ లో ఉన్నవారు తప్ప.. ఇతరులను ఎవరినీ లోపలికి రానివ్వడం లేదని చెప్పారు. అతనిని కూడా సాధారణ ఖైదీలాగా చేస్తున్నామని చెప్పారు.