వాహనదారులకు భారీ షాక్

First Published Apr 2, 2018, 11:24 AM IST
Highlights
నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్ ధరలు

వాహనదారులకు భారీ షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరిపోయాయి. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.73.73గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.64.58గా ఉంది. ఎక్సైజ్‌ పన్నును తగ్గించాలని చమురు సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్న సమయంలో పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడం గమనార్హం. గతేడాది జూన్‌నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే.

నేడు దిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు ఏకంగా 18పైసలు పెరిగింది. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.73.73గా ఉంది. 2014, సెప్టెంబరు 14 తర్వాత ఇదే అధిక ధర. ఇక డీజిల్‌ ధర కూడా అమాంతం పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.64.58గా ఉంది. గతంలో డీజిల్‌ గరిష్ఠ ధర(రూ.64.22) ఫిబ్రవరి 7, 2018న నమోదైంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2016 వరకు జైట్లీ తొమ్మిది సార్లు చమురుపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచారు. అయితే.. ఒకే ఒక్కసారి మాత్రమే దాన్ని తగ్గించారు. గతేడాది అక్టోబరులో కేంద్రం చమురుపై విధిస్తున్న సుంకాన్ని లీటరుకు రూ.2మేర తగ్గించింది. ఆ సుంకాన్ని మరింతగా తగ్గించాలని చమురు సంస్థలు కోరుతున్నాయి.

click me!