నేరుగా ఎన్నికల్లో దూకనున్న పవన్ కల్యాణ్

First Published Dec 20, 2017, 12:10 PM IST
Highlights

2018లో  టాలివుడ్ లో పవన్ డిమాండ్ పెరిగిపోతుంది

దానితో రాజకీయాలు- సినిమాని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది

అందుకే పవన్ నేరుగా ఎన్నికల్లో కే దూకేస్తారా?

 

 

పవన్ కల్యాణ్ కు ప్రతిష్టాకరమయిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. జనవరి 10 విడుదలవుతూ ఉంది. నిన్న ఆడియో ముగిసింది. అమెరికాలో రికార్డు స్థాయిలో 570 స్క్రీన్ లమీద రిలీజ్ అవుతున్నది. టీజర్ మరొక రికార్డు సృష్టించింది. 24 గంటల్లోనే కోటి వ్యూస్ దాటింది. ఇదీ పవన్ కల్యాణ్ పరిస్థితి. పవన్ అంటే యమ క్రేజ్ ఉంది. దాంట్లో అనుమానం లేదు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు కలలు కంటుంటారు. 

చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అధిపతిగా విశాఖ, విజయవాడ, ఒంగోలులో పర్యటించారు. ఈ పర్యటన కార్యకర్తలలో బాగా ఉత్సాహన్ని నింపింది. రాజకీయంగా వివాదమయినా సరే, పవన్ బయటకొస్తున్నాడు, 2019 ఎన్నికలకు సమాయత్తమయేందుకు ఇక జిల్లాలు తిరుగుతాడని ఆశిస్తున్నారు.

కాని పరిస్థితి చూస్తే పవన్ సినిమాల్లో  2018లో చాలా బిజిగా ఉండబోతున్నారు. ఆయన  2019 దాకా తీరుబడి లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల ఆయన పూర్తిగా జనసేన సమీకరణ మీద రాజకీయ యాత్ర చేసే సూచనలు తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే,చాలా మంది నిర్మాతలు ఆయన వెంటబడుతున్నారు. కథలు నచ్చితే సినిమా చేస్తానని హామీ కూడా ఇస్తున్నారు.

ఇలా హమీలు పొందిన నిర్మాతల జాబితాలో  ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నాడు. గతంలో పవన్ హీరోగా దిల్ రాజు సినిమా చేసే ఛాన్స్ ఉందనే మాటలు వినిపించాయి. కానీ వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాలు, సినిమాలు అంటూ చాలా బిజీ అయిపోయాడు. అజ్ఞాతవాసి తర్వాత  కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి 2019 ఎన్నికల ముందు నుండి సినిమాలకు దూరమవుతానని కొన్ని సంధర్భాల్లో చెప్పుకొచ్చాడు.  2019 కొద్దిగా ముందు పూర్తిగా రాజకీయాలలోకి వస్తే టైం సరిపోతుందా? అనేది అభిమానుల్లో ఉన్న ప్రశ్న.

ఇపుడు  పవన్ తనతో సినిమా చేస్తాడని దిల్ రాజు ధీమాగా ఉన్నారు.  ఎందుకంటే, ఇటీవల పవన్ కల్యాణ్ ను దిల్ రాజు  సినిమా పనిమీద కలిశారట. ఆ ప్రస్తావన తీసుకురాగా, రాజకీయాలతో సంబంధం లేకుండా, మంచి కథ సెట్ అయితే మీతో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చాడట.  ఈ విషయాన్ని దిల్ రాజు పబ్లీకుగానే  చెప్పాడు. ఈ లెక్కన  పవన్ చాలా మందికి సినిమాలు బాకీ ఉన్నాడనక తప్పదు. ఏ.ఎం.రత్నంతో ఓ సినిమా చేయాలి. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇపుడ దిల్ రాజ్ కమిట్ మెంటు. మరి ఈ కమిట్మెంట్స్ అన్నీ ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి!

 

అజ్ఞాతవాసి చిత్రం సూపర్ డూపర్ హిట్టవుతుందని, దానితో పవన్ ఇంకా ఎక్కువ బిజీ అవుతారు తప్ప తగ్గేది లేదని సినిమా పండితులొకాయన చెప్పారు. ఈలెక్కన 2018 లో పవన్ పూర్తి స్థాయి రాజకీయ యాత్రలకు  పూనుకోవడం కష్టమేనేమో అనిపిస్తుంది. నాటి ఎన్టీ రామారావులాగా నేరుగా ఎన్నికల క్యాంపెయినే ప్రారంభిస్తారేమో. ఎందుకంటే, గుజరాత్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా  పార్టీలో 2019 అంటే భయం మొదలయిందని,అందుకే 2018 చివర్లోనే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అంటున్నారు. అందువల్ల పవన్ నేరుగా ఎన్నికల బరిలోకే అంటున్నారు.

 

 

click me!