పవన్ ముసుగు తీసేసి బయటకు రావాలి

First Published Dec 7, 2017, 11:21 AM IST
Highlights
  •   పవన్ తన రాజకీయాల మీద ఇంకా స్పష్టత ఇవ్వాలి.
  • తన పోరాటం ఎవరి మీద స్పష్టం చేాయాలి
  • తన లక్ష్యం ఏమిటో వెల్లడించాలి.
  • ప్రశ్నించడమే పని అనే గందరగోళం నుంచి బయటకు రావాలి

పవన్ కల్యాణ్ రాజకీయ ఉద్దేశం ఏమిటి?

ఆయనేమో పవర్, పదవి కోసం రాజకీయం కాదంటున్నారు.

 అంతేకాదు, ఎపుడు ముఖ్యమంత్రి కుర్చీని మనసులో పెట్టుకుని అడ్డదిడ్డంగా  హామీలిస్తూ పోతేఎలా అని పరోక్షంగా జగన్ మీద విరుచుకుపడ్డారు.తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని చెబుతున్నారు. తానుండేది ప్రశ్నించేందుకే అని పదే పదే చెబుతున్నారు.అయితే, అభిమానులు మాత్రం పవన్ ముఖ్యమంత్రి అనే నినాదాలు చేస్తున్నారు.

 

ఆ మధ్య ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చాక శంషాబాద్ ఎయిర్ పోర్టులో గుమికూడిన అభిమానులందరి నినాదం ఒక్కటే, పవనే వచ్చే ముఖ్యమంత్రి, అని. ప్రతిసభలోనూ... ఆయనేమో పదవీరాజకీయాలను విమర్శిస్తారు. అభిమానులేమో  పవనే ముఖ్యమంత్రి అని అరుస్తున్నారు.ఈ రోజు కూడా అదే జరిగింది. ఆయన ఈ ఉదయం పోలవరం సందర్శించారు.ఆయన ప్రాజక్టును పరిశీలిస్తుంటే అభిమానులు ,పోలవరం నినాదాలు కాకుండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్,కాబోయే ముఖ్యమంత్రి పవన్ అంటూ నేపథ్యం గీతం మొదలుపెట్టారు.

మరి పవన్ ముఖ్యమంత్రి అవుతారా?అయనకు అలాంటి కోరిక ఉందా?  ఆయన రాజకీయాలు చూస్తే అటువైపు సాగుతున్నట్లు లేవు.

ఎందుకంటే... ఉత్తర భారత ప్రభుత్వం దక్షిణ భారత దేశం మీద వివక్ష చూపుతున్నారని  తీవ్ర ఆరోపణలుచేసి బిజెపిని,  ప్రధానిని ఇరుకున పెట్టారు.ఈ సిద్దాంతంతో ఆయన చాలా ప్రసంగాలు చేశారు.దక్షిణాది తరుగబడే రోజొస్తుందన్నారు. ఇపుడు ఆయన వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి మీద తెగ దాడి చేస్తున్నారు. జగన్‌ పాదయాత్ర ఉంటుందని ప్రకటించిన రోజే, పవన్‌ టూర్‌ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసినరోజే, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియ మొదలుపెట్టి మీడియాను తన వైపు తిప్పుకున్నారు. ఈ రోజు వైసిపి నేతలు పోలవరం వెళుతూ ఉంటే తను వారి కంటే ముందే అక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శించాలనే నిర్ణయంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.వైసీపీకి పోలవరం విషయంలో మైలేజ్ రాకూడదనే పవన్ వస్తున్నారన్నది  వైసిపి ఎమ్మెల్యే రోజా వంటి వారి ఆరోపణ.  

తర్వాత టిడిపి మీద ఆయన విమర్శలు అంత పదునుగా లేవంటున్నారు. పవన్ ను స్పాన్సర్ చేస్తున్నది టిడిపియే అని  వైసిపి నేతలు పదే పదే విమర్శిస్తున్నారు. ఇది చాలా తీవ్రమయిన విమర్శ. పై ట్రెండ్ చూస్తే ఇది నిజమా అని పిస్తుంది. బిజెపి, వైసిపిలను విమర్శిస్తూ ఉండటం ఈ అరోపణలకు బలమిస్తూ ఉంది.

అయితే, దీనివల్ల పవన్ కు ఒరిగేదేమిటి?

ఎందుకంటే, ఆయన రాజకీయాలు టిడిపికి అనుకూలమయితే,  ముఖ్యమంత్రి పదవిని టిడిపి వదులుకుని ఆయనకు అప్పచెప్పేది ఉండదు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  వారసుడిని ఎంచుకుని శిక్షణ కూడా ఇస్తున్నారు.అలాంటపుడు పవన్ అభిమానుల కోరిక అంటే పవన్ ముఖ్యమంత్రి అనే కోరిక నెరవేరేదెలా? పవన్ తన రాజకీయ లక్ష్యం స్పష్టం చేయాలి. పవర్ లేని రాజకీయాలుండవు. పవర్ కోసమే రాజకీయాలు. పవర్ స్టార్ పవన్ అని నిరూపించుకోవాలి. అందువల్ల ముసుగు తన్నేసి పవన్ తనరాజకీయ కార్యక్రమం వెల్లడించాలి. అపుడే అభిమానులు అంకిత భావంతో పనిచేస్తారు. ప్రజలు ఆయన వైపు చూస్తారు. 

 

 

click me!