ప్రాణాలు పోతున్నా.. బిడ్డను కాపాడింది

First Published Jan 18, 2018, 1:50 PM IST
Highlights
  • రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తన ప్రాణాలు పోయినా సరే.. తన బిడ్డ ప్రాణాలు మాత్రం పోకూడదనుకుంది ఆ తల్లి. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి చెందిన బండ శ్రీను(25), గౌరి(25) దంపతులకు కుశాలవర్థన్(4), హేమరఘురాం అనే ఇద్దరు పిల్లు ఉన్నారు. శ్రీను, గౌరీ దంపతులు పిల్లలతో కలిసి సంక్రాంతి పండగ కోసం మూడు రోజుల కిందట పెందుర్తి మండలం గండిగుండం గ్రామానికి వెళ్లారు.

 

పండగ ముగుంచుకొని ద్విచక్రవాహనంపై తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. సబ్బవరం శివారు చిన్నయ్యపాలెం టెర్రాకాన్ లేఅవుట్ వద్దకు వచ్చేసరికి వారి బైకును వెనుకగా ఆర్టీసీ బస్సు వచ్చింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో వీరి బైకును ఆ బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీను.. బైక్ పై ముందు కూర్చున్న పెద్దకుమారుడులు పక్కనే ఉన్న తుప్పల్లో పడిపోయారు. గౌరి మాత్రం తన చిన్న కుమారుడితోపాటు రోడ్డుపై పడిపోయింది. కాగా.. వెనుక ఉన్న ఆర్టీసీ బస్సు తనవైపు దూసుకురావడం ఆమె గమనించింది. వెంటనే తన రెండేళ్ల బాబుని చేతలతో పట్టుకొని రోడ్డు పక్కన తుప్పల్లోకి విసిరేసింది. ఆ వెంటనే రెప్పపాటులో బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లాయి. దీంతో గౌరి అక్కడికక్కడే మృత్యువాతపడింది. కాగా.. శ్రీను.. ఇద్దరు పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గౌరి మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

click me!