నార్మన్ ఫోస్టర్ రాజధాని నమూనాలు బాబు కు నచ్చలేదా!

First Published Oct 26, 2017, 1:04 PM IST
Highlights

జపాన్ అర్కిటెక్ట్  మ్యాకీ దారిలోనే నార్మన్ ఫోస్టర్ కు కూడా ఉద్వాసన తప్పదా?

ప్రఖ్యాత లండన్ అర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్  అమరావతి రాజధాని పాలనానగరం నమూనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు కు నచ్చలేదని విశ్వసనీయంగా తెలిసింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో ఈ నమూనాలను పరిశీలించారు. ఈ నమూనాలు ఒక దఫా నచ్చకపోవడంతో మళ్లీ గీసుకురమ్మని ముఖ్యమంత్రి పురమాయించారు. అయనకు లండన్ పెద్దాయన నమూనాలు ఎంత గానచ్చలేదంటే, బాహుబలి  డైరెక్టర్ రాజమౌళినుంచి  సలహాలు తీసుకోమని చెప్పారు. రాజమౌళిని లండన్ పంపారు. బాహుబలి డైరెక్టర్, నార్మన్ ఫోస్టర్ లోతుగా చర్చించారు. బాహుబలిచిత్రంలో మహిష్మతి రాజధాని నగరాన్ని రూపొందించిననట్లుగా అమరావతిని కూడా గొప్పగా రూపొందేందుకు నార్మన్ రాబర్ట్ ఫోస్టర్ కు రాజమౌళి సలహాలు ఇవ్వాలి. అయితే, రాజమౌళి, నార్మన్ ఫోస్టర్ చర్చల తర్వాత రూపొందిన నమూనాలను నిన్నముఖ్యమంత్రి పరిశీలించినా, సంతృప్తి వ్యక్తం చేయలేదు.

 

ఈ నమూనాలు కూడా ముఖ్యమంత్రికి నచ్చలేదని ఆందుకే ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ వర్గాలు ‘ఏషియానెట్ ’ కు చెప్పాయి.బహుశా జపాన్ మాకీ అసోసియేట్స్ కంపెనీని తరిమేసినట్లే నార్మన్ ఫోస్టర్ ను కూడా తప్పించే ప్రమాదం ఉందని కూడ ఈ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కి నచ్చనందున ఈ నెలాఖరుకు నార్మన్ ఫోస్టర్ నమూనాలు తయారయ్యే అవకాశం లేనేలేదని కూడా ఈ వర్గాలు తెలిపాయి. అసలు రాజధాని భవనాల నమూనాలు, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కట్టాలనడం తప్ప, అదెలాగో ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ రాజధాని పర్యవేక్షకుల్లో ఎవరికి కూడా తెలియదు. అందుకే ఏ నమూనా వారికి నచ్చడం లేదు. చివరకు రాజమౌళిని రంగంలోకి దింపారని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అర్కిటెక్ట్ కు సలహా ఇచ్చేందుకు సినిమా డైరెక్టర్ ను పంపడం మంచి ఆలోచన కాదని ప్రభుత్వ వర్గాల్లో ఉంది. మొత్తానికి ఇపుడు గోప్యంగా ఉన్న చంద్రబాబు అసంతృప్తి తొందర్లోనే బయటపెట్టే అవకాశం ఉందని ఈ వర్గాలు భావిస్తున్నారు.

 

చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ త సమావేశమయ్యాక ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు  ఇవి. నమూనాల మీద ముఖ్యమంత్రి సంతృఫ్తి వ్యక్తం చేశారనే విషయం లేకుండా చాలా జాగ్రత్తగా ఈ నోట్ తయారు చేశారు. చూడండి:
 

ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలిచే అత్యద్భుతమైన రాజధానిని నిర్మించడం కోసమే ఇంత పెద్దఎత్తున కసరత్తు చేయాల్సివస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పునరుద్ఘాటించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన అమరావతి పరిపాలన నగర ఆకృతులు, ప్రణాళికలపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తో సమావేశమయ్యారు. ‘ఐదు కోట్ల మంది ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు.  వారు విలక్షణమైన, దిగ్గజ నమూనాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చెప్పారు.  ప్రపంచంలోని తొలి ఐదు నగరాలలో ఒకటిగా నిలిచే నగరం అంటే దాని నిర్మాణశైలి, ఆకృతులు అసాధారణ రీతిలో, అపూర్వంగా నిలిచేలా ఉండాలని చెప్పారు. దానికోసమే ఇంతగా కష్టపడుతున్నామని, ఎడతెగని సమాలోచనలు చేస్తున్నామని వివరించారు. అత్యుత్తమ ఆర్కిటెక్టుగా అంతర్జాతీయంగా మంచి పేరున్న ఫోస్టర్ సంస్థ అమరావతి కోసం తలమానికంగా నిలిచే ఆకృతులు అందిస్తుందనే ఉద్దేశంతోనే ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించామని గుర్తుచేశారు. ఈ నమ్మకాన్ని నిలిపేలా తుది ఆకృతులు ఉండాలని అన్నారు. ‘మీరిచ్చిన ఆకృతులు, ప్రణాళికలతో మీరు తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.

click me!