
నిద్ర లేస్తూనే అట్లా బయట చిరుచినుకులు పడుతుంటే ఆ ఆనందమే వేరు..
ఎండకు వానకు ఏదో ఒప్పందం ఉన్నట్లుంది, మా రాయలసీమలో రాత్రి ఎంత పెద్ద వాన వచ్చినా ఉదయాన్నే ఎండ కాయాల్సిందే..
ఎప్పుడు వాన పడినా ఇదే జరుగుతుంది.
పిల్లపుడువాన ఎప్పుడన్నా రాత్రి చితక్కొట్టినా పొద్దున్నే లేచి స్కూల్ కి పోవాల్సి వచ్చేది.
ఎందుకంటే ఆరు కల్లా వాన నిల్చి పోయేది, దాంతో ఎగరగొట్టాలనుకున్నా బడి కి పోవాల్సి వచ్చేది..
ఎప్పుడో ఏళ్ళకొక్క సారీ ఉదయం కూడా చినుకులు పడుతుంటే ఉండే ఆనందం ఏ వేరుగా ఉండేది..
ఏడు అయినా ఇంకా నల్లని మోడాలు అలా ముసురుకొని ఉంటే ఇంటి మీది గవాసులు,కిటికీలు మూసే ఉంటాయి. ఇండ్లంతా మొబ్బు. ఒక రోజు పొద్దున, టైం ఎనిమిది అవుతుందనంగా వాన చిన్నగా తగ్గటం మొదలయింది..నా గుండెల్లో ఎక్కడో దిగులు మొదలయింది. ఈ వాన రాత్రంతా
పడి సరిగ్గా తొమ్మిది కల్లా తగ్గిపోతుందనే బాధ.
మా వాళ్ళు రేయ్ స్కూల్ కి టైం అవుతుంటే ఇంకా దిక్కులు చూస్తున్నావ్ ఏందిరా, వాన పడుతుంది.తగ్గుతుంది. లే చిన్నగా పడుతావుంది. నానితే ఎమన్నా మొలకెలొస్తాయా అనేటోళ్లు. నేను మిద్ది ఎక్కి ఇంకోసారి మోడాల వంక చూసా. ఈసారి దూరాన దట్టంగా నల్లంగా మోడాలు చూసి, ‘పర్వాలేదు, సంచిసర్దుకునే లోపు వాన జోరుగా కురుస్తుంది,’ అనుకున్నా. వాన జోరెపుడవుతుందా అని ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూసే వాణ్ని. అలా చాలాసార్లు, బడికి తయారయేలోపు చినుకుల వేగం ఒక్కసారిగా జోరుకావడం జరిగేది.అప్పట్లో వాన వస్తుంది అంటే కరెంటోళ్ల కరెంటు తీసేసే వాళ్లు. ఇంక ఎండా కాసే వరకు కరెంటు వచ్చేది కాదు.
ఒక సారి, పొద్దనే, ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులతో వాన విరుచుకుపడింది, గంట సేపు చితకొట్టింది.ఇంక నెేం స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యా లోలోపల హుశారుగా. వాన వెలిసే సరికి పదిన్నర దాటింది... ఇంకేం స్కూల్? ఎంత సంబరమో. ఆరోజు నల్లని మోడాలు ఇంకా అలానే కమ్ముకొని వున్నాయి. స్కూల్ ప్రస్తావనే రాలేదు.
హమ్మయ్య, ఈరోజు స్కూల్ లేదు గీల్ లేదు అని ఎగిరి గంతేసా..ఊర్లో జనాలు గొడుగులు సూపర్ కవర్లు తల మీద వేసుకొని ఊరి చివరన వున్న వంక కాడికి పోతున్నారు, వంకేమనా వస్తుందా అని చూసేందుకు. వానొచ్చినపుడు వంక యాత్ర తప్పని సరి. వంకరాలే. పైన వాన బాగా పడింది సాయంత్రాని కల్లా బాగా పారుతుంది అని జనం ళ్లిపోతుంటారు. నెేను నా మిత్రులు కలిసి క్రికెట్ అన్నా ఆడతాం అని అలా ఉరిబయట గ్రౌండ్ కి వెళితే అది మొత్తం బురద బురద అయింది.ఎలాగూ వచ్చాం కదా వంక దాకా పోదామనుకుని అందరం బయలు దేరాము.పోయి చూస్తే తెల్లటి ఇసుక మధ్యన ఒక సన్నగా నీళ్ళ పాయ వయ్యారంగా పారతావుంది.
మేం ఇసుకతో ఒక కట్ట కట్టి నీళ్ళను ఆ చివరకు మళ్లించి కొంత సేపు అడుకున్నామో లేదో నీళ్ళు ఎర్రగా మారి క్రమంగా ప్రవాహం పెరిగింది.
ఆకులు, కట్టెలు కొట్టుకొస్తున్నాయి, చూస్తుండగానే నీళ్ళతో వంక నిండుగా పారడం మొదలయింది. అంటే పైన బాగా వానపడిందన్నమాట.
అలా పారే వొండు నీళ్లని, కొట్టుకొచ్చే ప్రతి కొమ్మని , మొద్దులను చూస్తూనే ఉన్నాం. మధ్యాహ్నం రెండయిందని ఎపుడో తెలిసేది.
‘రేయ్ పోదాం పాండి, అన్నం తిందాం లేకుంటే ఇంట్లో తంతారు అని బయలుదేరాం..దారి మధ్యన కప్పలు,తొండలు,చీమలు... వర్షానికి నాని ఎగురుతున్న కాకులు,పక్షులు చూస్తూ బురదలో తొక్కుకుంటూ ఇంటికి చేరాము..
అలా వర్షం కురిసిన ఉదయం ముగిసింది.
మా దరిద్రం ఏమంటే ఎప్పుడు చూసినా వాన అదివారమో సెలవు దినాల్లోనో ఎక్కువ పడేది. ఈ పోద్దులాగా తెలవారినా, పొద్దునంతా వాన కురియక చాన్నాళ్లయింది. ఈ రోజు మళ్లీ ఇలా కనిపించింది.
***
ఈ రోజు ఉదయం 10 అయినా ఇంకా చినుకులు పడతుంటే గుర్తొచ్చి రాసా..
మాకు వానంటే అంతే వస్తే పనులన్నీ అలా ఆపేసి చూస్తూ రోజంతా ఎంజాయ్ చేస్తాం..