
ఒకవైపు నోట్ల రద్దు వల్ల దేశం ఉడికిపోతుంటే మరోవైపు నరేంద్రమోడి పేదలను రెచ్చగొడుతున్నట్లు కనబడుతోంది. పేదలను ఆకట్టుకునేందుకు పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘పేదల జన్ ధన్ ఖాతాల్లో పడిన పెద్దోళ్ల డబ్బంతా మీరే వాడేసుకోండి’ అంటూ పిలుపివ్వటంతో అందరూ నిశ్చేష్టులయ్యారు.
ఎంత ప్రధానమంత్రి అయినా ఆ విధంగా చెప్పటం ఏమాత్రం సబబుగా లేదని పలువురు ఆక్షేపిస్తున్నారు. జన్ ధన్ ఖాతాల్లో పడిన డబ్బును వెనక్కు ఇవ్వమని అడిగితే ఎట్టి పరిస్ధితుల్లోనూ వెనక్కు ఇవ్వద్దని చెప్పటమే తప్పని అందరూ అనుకుంటుంటూ అడిగిన వాళ్లకి తన పేరు చెప్పమని చెప్పటం మరీ చీప్ గా ఉంది.
త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో గెలవటం భాజపాకు అంత వీజీ కాదు. ఇటువంటి నేపధ్యంలోనే నోట్ల రద్దు, బంగారం నిల్వలపై ఆంక్షలను కేంద్రం తెరపైకి తీసుకువచ్చింది. దాంతో భాజపా శ్రేణుల గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లైంది.
ఎన్నికల జరగాల్సిన రాష్ట్రాల్లో కనీసం ప్రచారానికి కూడా నేతలు వెళ్లలేకున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే మోరాదాబాద్ లో జరిగిన బహిరంగసభలో మోడి జన్ ధన్ ఖాతాల్లో పడిన డబ్బును ఎవరికీ వెనక్కు ఇవ్వద్దని చెప్పటంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
అందరి మనోభావాలను గమనించిన మోడి ప్రజలను రెచ్చగొడుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. జన్ ధన్ ఖాతాల్లో నల్ల కుబేరుల సొమ్ము జమైందన్న విషయం ఆధారాలతో సహా నిరూపించే అవకాశం ఉన్నపుడు వారిని శిక్షించాలి గానీ ఈ విధంగా చట్ట విరుద్దమైన పనులు చేయమని పేదలను ప్రోత్సహించటమేమిటో ప్రధానికే తెలియాలి.