ఫిరాయింపు మంత్రిపై ఎదురుదాడి

First Published Nov 29, 2017, 12:50 PM IST
Highlights
  • తెలుగు భాషపై అసెంబ్లీలో చర్చ
  • తెలుగు భాష గురించి మాట్లాడుతూ ఆంగ్ల పదాలు వాడిన   మంత్రి అఖిలప్రియ
  • చురకలు అంటించిన ఎమ్మెల్యే శివాజీ

ఫిరాయింపు మంత్రి అఖిలప్రియకు అసెంబ్లీలో చుక్కెదురైంది. ఇతర   శాసనసభ్యులు ఆమె పై ఎదురుదాడికి దిగారు. అసలు విషయం ఏమిటంటే.. ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పార్టీ కోసం కృషి చేస్తున్న వారిని కాదని.. ఫిరాయింపు నేతలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని సమయం వచ్చినప్పుడల్లా.. చూపిస్తూనే ఉన్నారు. ఫిరాయింపు మంత్రులకు అసెంబ్లీలో చుక్కలు చూపిస్తున్నారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. బుధవారం అసెంబ్లీలో తెలుగు భాషపై చర్చ జరిగింది. ఈ విషయంపై మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాధాన్యం గురించి వివరించారు.  అయితే.. ఆమె తెలుగు భాష గురించి చెబుతూనే కొన్ని ఆంగ్ల పదాలు వాడారు. దీంతో ఆమెకు తోటి శాసనసభ్యులు చురకలు అంటించారు.  శ్రీకాకుళం జిల్లా పలాస  ఎమ్మెల్యే శివాజీ స్పందిస్తూ.. తెలుగులో మాట్లాడాలని చెబుతూనే మంత్రి ఆంగ్లంలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో శాసనసభ్యులు ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

ఇప్పటికే ఇసుక అక్రమరవాణా విషయంలో ఫిరాయింపు మంత్రి సుజయ కృష్ణ రంగారావుని, పంట గిట్టుబాటు ధర, మార్కెటింగ్ విషయంలో మరో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యేలు ఉతికి ఆరేశారు. అదే కోవలో తాజాగా అఖిలప్రియపై విరుచుకుపడ్డారు.

click me!