మరోసారి భాజపా నేతలపై విరుచుకుపడ్డ అయ్యన్న పాత్రుడు

First Published Dec 1, 2017, 2:27 PM IST
Highlights
  • బీజేపీ నేతలను డూప్లికేట్ నేతలన్న అయ్యన్న
  • పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణ

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి భాజపా నేతలపై విరుచుకుపడ్డారు. కొందరు డూప్లికేట్ భాజపా నేతలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని అయ్యన్న విమర్శించాడు. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం పిలిచిన స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ టెండర్లను నిలిపేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం విషయంపై శుక్రవారం అయ్యన్న మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు  వంటి నేతలు పోలవరానికి అడ్డుపడుతున్నారని అన్నారు. వీళ్లందరూ డూప్లికేట్ బీజేపీ నేతలని వ్యాఖ్యానించారు. అసలైన బీజేపీ నేతలు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. పోలవరం కోసం కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. గతంలోనూ పురందేశ్వరి, లక్ష్మీనారాయణ, కావూరి లాంటి వారిని డూప్లికేట్ నేతలని అయ్యన్న ప్రస్తావించారు. వీరంతా కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వచ్చారు కాబట్టి వీరిని డూప్లికేట్ నేతలుగా అయ్యన్న సంబోధించారు. కాగా అయ్యన్న వ్యాఖ్యలను      భాజపా నేతలు తిప్పికొట్టారు. మీరు ఏకంగా డూప్లికేట్ నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టారుగా అంటూ విమర్శించారు. మరి ఈ పోలవరం విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవైపు చంద్రబాబు కేంద్రం, భాజపా నేతలను ఎవరూ విమర్శించవద్దూ అంటూ చెబుతుంటే.. మరోవైపు మంత్రులు మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు.

click me!