అబ్బాయిలూ..కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది

First Published Apr 9, 2018, 2:04 PM IST
Highlights
లేటు అయ్యిందా..? లెక్కపెట్టాల్సిందే

తాతలు,ముత్తాతల కాలంలో.. ఒక్కొక్కరు పది మంది సంతానం ఉండేవారు. తర్వాత తర్వాత. ఇద్దరు ముగ్గురుతో పుల్ స్టాప్ పెట్టేయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుత కాలంలో ఒకరికి మాత్రమే ఓటు వేస్తున్నారు.అంతెందుకు 90ల కాలంలో ఎక్కువగా అబార్షన్ లు చేయించుకోవడం కోసం హాస్పటల్స్ చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. పిల్లలు పుట్టడం లేదంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.ఈ మధ్యకాలంలో ఐవీఎఫ్ విధానం అదేనండి.. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలను కనడం ఎక్కువైపోయింది. ఇందుకు ప్రధాన కారణం పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడమే అంటున్నారు నిపుణులు.

పిల్లలు పుట్టకపోవడానికి.. కేవలం సమస్య పురుషుల్లోనే ఉంటుందా? మహిళలలో ఉండదా అనే అనుమానం మీకు రావచ్చు. ఇద్దరిలోనూ లోపాలు ఉండొచ్చు. అయితే.. ఎక్కువ శాతం పురుషుల్లో వీర్యకణాలు తగ్గిపోవడమే అంటున్నారువైద్యులు. ప్రపంచవ్యాప్తంగా యువకుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి పునరుత్పాదక శక్తి సన్నగిల్లుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. అమెరిన్‌ సొసైటీ ఆఫ్‌ ఆండ్రాలజీ ఉత్తర అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా ఖండాల్లో యువకుల్లో వీర్యకణాల 
స్థితిగతులపై పరిశోధనలు జరిపింది. 4 దశాబ్దాల్లో యువతలో వీర్యకణాల వృద్ధి 52 కు తగ్గిందని ఆ సంస్థ వెల్లడించింది. ఆహారపు అలవాట్లు, బరువు, ధూమపానం, మద్యపానం ప్రభావంతో ఒక వ్యక్తి జీవిత కాలంలో వీర్యకణాల ఉత్పత్తి హెచ్చుతగ్గులకు లోనవుతోందని తేలింది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లోనూ ఈ సమస్య ఉంది. కానీ, కొంత తక్కువ. వీర్యకణాల సాంద్రత తగ్గడంపైనా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు.. 1973లో ఒక మిల్లీలీటరు వీర్యంలో సగటున 99 మిలియన్ల వీర్యకణాలు వుండేవి. 2011 నాటికి అవి 47 మిలియన్లకు పడిపోయాయని తేలింది.మిల్లీలీటరు వీర్యంలో 40 మిలియన్ల కణాల కంటే తక్కువ వుంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 15 మిలియన్ల కంటే తక్కువ వీర్యకణాలుంటే సంతాన భాగ్యం ఉండదని ఆ సంస్థ తెలిపింది. అంతేకాదు.. వీర్యకణాల సంఖ్యతక్కువగా ఉన్న వారికి అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

click me!