
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలపైనా, కావేరీ జల వివాదంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ నేత కుమారస్వామి ధ్వజమెత్తారు. కావేరీ జలాల వివాదంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను తాను ఆహ్వానించలేనని ఆయన అన్నారు. ప్రస్తుతానికి రజనీకాంత్ గానీ, తాను గానీ ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులం కాదని ఆయన అన్నారు. అదే సమయంలో ఆయన రజనీకాంత్ ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
సాధారణ పౌరుడిగా తాను రజనీకి విజ్ఞప్తి చేస్తున్నానని, ఓసారి ఇక్కడికి వచ్చి రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిశీలించాలని, తమ రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో గమనిస్తే రజనీకాంత్ తన మనసు మార్చుకుంటారని అన్నారు.
సోమవారం ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి మంత్రి మండలిపై నిర్ణయం తీసుకుంటారు. ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుమారస్వామి చర్చిస్తారు.
రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం భేటీలో రజనీ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. యడ్యూరప్ప బలపరీక్షకు 15 రోజులు గడువు ఓ జోక్ అని రజనీకాంత్ అన్నారు. కావేరీ జలాల బోర్డును కర్ణాటక ఆధీనంలో కాకుండా సీనియర్ ఐఏఎస్ పర్యవేక్షణలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ చేసిన ఆ వ్యాఖ్యలపై కుమారస్వామి స్పందించారు. కర్ణాటకలో తమ పరిస్థితులు అర్థం చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.