
హైదరాబాద్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలంగాణ ఐటి,మునిసిపల్ శాఖ మంత్రి కెటిరామారావు ఇపుడు నగరం లోపలి సమస్యల మీద దృష్టి సారిస్తున్నారు. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్ కూతరు వచ్చినపుడు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసి కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందంగా తీర్చిదిద్దడం బాగా విమర్శలకు గురయింది. దీని మీద సోషల్ మీడియాలో లెక్కలేనంత హాస్యం, ఎకసక్కాలు ప్రవహించాయి. దీనితో ఇపుడు నగరంలోని కాలనీల్లో సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నారు. దీని కోసం వచ్చే వారం నుంచి ‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో టౌన్ హాలు సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్నిఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కాలనీ వాసుల సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా అక్కడి సమస్యల గురించి చర్చిస్తారు. ‘మన నగరం’ పేరుతో ఉన్న లోగోలను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.