బార్ కౌంటర్ లో మహిళలు..!

First Published Oct 28, 2017, 4:52 PM IST
Highlights
  • మద్య నిషేధం కోసం మహిళల పోరాటం సర్వసాధారణం. 
  • కేరళ మహిళలూ గతంలో అనేకసార్లు అదే తరహా ఉద్యమాలు చేశారు. 
  • కానీ... నేటి తరం మహిళలు పంథా మార్చారు.
  • మద్యం విక్రయ రంగంలో తామెందుకు పనిచేయకూడదనుకున్నారు. 

కేరళలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇకపై మహిళలూ విధులు నిర్వర్తించనున్నారు. లింగ సమానత్వం కోసం ఎలుగెత్తి న్యాయపోరాటం సాగించిన మలయాళీ మహిళలు... ఈమేరకు చారిత్రక విజయం సాధించారు. ఇప్పటివరకు పురుషులకు మాత్రమే పరిమితమైన మద్యం విక్రయ రంగంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

మద్య నిషేధం కోసం మహిళల పోరాటం సర్వసాధారణం. కేరళ మహిళలూ గతంలో అనేకసార్లు అదే తరహా ఉద్యమాలు చేశారు. కానీ... నేటి తరం మహిళలు పంథా మార్చారు.మద్యం విక్రయ రంగంలో తామెందుకు పనిచేయకూడదనుకున్నారు. అయితే... కల్లు, మద్యం దుకాణాల్లో మహిళలకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వరాదన్న.... కేరళ అబ్కారీ దుకాణాలు నిబంధనలు, విదేశీ మద్యం నిబంధనలు తమకు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా నిబంధనలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగారు.

కేరళ హైకోర్టు వేదికగా.... ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, మహిళా సంఘాలకు సుదీర్ఘ న్యాయపోరాటం సాగింది.చివరకు... మహిళల్ని విజయం వరించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మహిళలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం.... రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమేనని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దామ శేషాద్రి నాయుడు 2013లో స్పష్టంచేశారు. కేరళ అబ్కారీ దుకాణాలు నిబంధనలు, విదేశీ మద్యం నిబంధనలు... లింగ సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చిచెప్పారు. ఇదే వ్యవహారానికి సంబంధించిన మరో కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్... 2016లో కీలక తీర్పునిచ్చారు. కేరళ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లో.... ప్యూన్లు, హెల్పర్లుగా ఆరుగురు మహిళల నియామకానికి చర్యలు చేపట్టాలని..... ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించారు. చివరకు... 2002నాటి కేరళ అబ్కారీ దుకాణాలు నిబంధనలు, 1953నాటి విదేశీ మద్యం నిబంధనల్ని.... సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేరళ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మహిళల నియామకానికి మార్గం సుగమమైనా.... వారి భద్రతపై అనేక ఆందోళనలు నెలకొన్నాయి. కొద్దేళ్లుగా మహిళలు, చిన్నారులపట్ల హింస అంతకంతకూ పెరుగుతున్న కేరళలో... మహిళలకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలివ్వడం ఎంతమాత్రం భద్రమన్న అనుమానాలు తలెత్తాయి. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన CSలత... ఈ ప్రశ్నలకు జవాబు వెతుకుతూ... కేరళ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.ఫలితంగా... మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌ జస్టిస్‌ జేబీ కోషి... మహిళల భద్రత దృష్ట్యా కీలక ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ఎవరూ మద్యం సేవించరాదని.... అక్కడి పనిచేసే మహిళలకు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేకుండా చూడాలని... ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మద్యం దుకాణాల్లో ఉద్యోగాలివ్వడంపై.... మానవ హక్కుల సంఘం ఛైర్మన్ సైతం మహిళలకు అనుకూలంగా ఆదేశాలిచ్చారు. కేరళ బేవరెజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన గోదాములు, కార్యాలయాల్లో ఇప్పటికే కొందరు మహిళలు పనిచేస్తున్నా.... మద్యం దుకాణాల్లో మాత్రం పనిచేయలేని దుస్థితి నెలకొందని... గుర్తించారు.ఇందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని రద్దుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని... జస్టిస్‌ కోషి సూచించారు.

click me!