కర్ణాటక ఎఫెక్ట్: బీహార్ లో ఆర్జెడీ, గోవాలో కాంగ్రెసు ఇలా..

First Published May 17, 2018, 5:17 PM IST
Highlights

కర్ణాటకలో బిజెపి చేపట్టిన అధికారానికి కాంగ్రెసు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది.

న్యూఢిల్లీ: కర్ణాటకలో బిజెపి చేపట్టిన అధికారానికి కాంగ్రెసు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఉద్యమం చేపట్టాలని యోచిస్తోంది. కాగా, గోవాలో తమకు అధికారం అప్పగించాలని గవర్నర్ పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెసు సిద్ధపడుతోంది. 

తాము అతి పెద్ద పార్టీగా అవతరించినందున కర్ణాటకలో మాదిరిగా తమకే అధికారం కట్టబెట్టాలని కోరుతూ కాంగ్రెసు గవర్నర్ వద్ద ఎమ్మెల్యేల చేత పరేడ్ చేయించాలని అనుకుంటోంది.

తమ 16 మంది శాసనసభ్యుల సంతకాలతో గవర్నర్ మృదుల సిన్హాకు ఓ లేఖను సమర్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని శుక్రవారం కోరుతామని గోవా కాంగ్రెసు శాసనసభా పక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ చెప్పారు. 

గోవాలో 2017 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు 17 సీట్లు గెలిచింది. మొత్తం 40 సీట్లు ఉండగా మెజారిటీకి నాలుగు సీట్లు మాత్రమే తక్కువయ్యాయి. బిజెపి 14 స్థానాలను గెలుచకుంది. గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎంజిపిలతో కలిసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు పార్టీలకు మూడేసి స్థానాలు వచ్చాయి. 

కర్ణాటక గవర్నర్ చూపిన దారిలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి 2017 మార్చి 12వ తేీదన చేసిన తప్పును గోవా గవర్నర్ సరిదిద్దుకోవాలని కవ్లేకర్ అన్నారు. 

ఇదిలావుంటే, కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు నిరసనగా శుక్రవారం తమ పార్టీ ధర్నా నిర్వహిస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ చెప్పారు 

ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏకైక అతి పెద్ద పార్టీగా ఉన్న తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని బీహార్ గవర్నర్ ను కోరుతామని చెప్పారు. 

click me!