చెన్నై మనసు దోచుకున్న మన ఆంధ్రా ‘కలంకారీ’

First Published Oct 14, 2017, 4:03 PM IST
Highlights
  • వస్త్ర ప్రపంచంలో ట్రెండ్ సృష్టిస్తోన్న ఆంధ్రా  కలంకారీ
  • అనార్కలీ మోడల్స్ లోనూ అదరగొడుతున్న కలంకారీ
  • సెలెబ్రెటీలను సైతం ఆకట్టుకుంటున్న కలంకారీ
  • చెన్నైలో కలంకారీ వస్త్రాలకు పెరిగిన డిమా ండ్

కలంకారీ వస్త్రాలు.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అని చెప్పవచ్చు. చీరలపై ప్రకృతి అందాలను జోడించి మరీ వీటిని తయారు చేస్తారు. ఆ మధ్య అవసాన దశకు చేరుకున్న ఈ హస్తకళా చిత్రం ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది. ఫ్యాషన్‌ డిజైనర్ల చేతుల్లో కొత్త రూపును సంతరించుకుని, అంతర్జాతీయ వేదికమీద వయ్యారాలు పోతూ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ఒకప్పుడు మహిళలు కట్టుకునే చీరలు, దుప్పట్లు, లుంగీలు లాంటి వాటిల్లోనే లభ్యమైన ఈ కలంకారీ వస్త్రాలు ఇప్పుడు చూడీదార్లు, అనార్కలీ మోడల్స్ లో కూడా లభ్యమౌతున్నాయి. సామాన్యులతో పాటు సెలెబ్రటీలను కూడా ఇప్పుడు ఈ కలంకారీ ఆకర్షిస్తోంది.

ఏపీలోని శ్రీ కాళహస్తి, మఛిలీపట్నం సమీపంలోని పెడన ప్రాంతంలో తయారయ్యే ఈ కలంకారీ వస్త్రాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు చెన్నై వాసులు కూడా మనసు పారేసుకుంటున్నారు. ఈ దీపావళి పండగ సందర్భంగా చెన్నైలో అత్యధికులు ఈ కలంకారీ వస్త్రాలకే ఓటు వేశారు. గత సంవత్సరం నుంచి అక్కడ ఈ రకం వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి. వీటి డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండటంతో చెన్నైలోని పాపులర్ షాపులతోపాటు, చిన్న చిన్న దుకాణాల్లో కూడా కలంకారీ వస్త్రాలకు స్పెషల్ సెక్షన్  ఏర్పాటు స్తున్నారు.

డ్రస్సుల్లోనూ కలంకారీకే ఓటు..

అన్ని రకాల చీరల్లోనూ, డ్రెస్ మెటీరియల్స్ లోనూ కలంకారీలకే ప్రజలు ఓటు వేస్తున్నారని  టెక్స్ టైల్ దుకాణ యజమాని  భారతి తెలిపారు.  రూ.1100, రూ.1200లకే కలంకారీ చీరలు లభిస్తుండంతో విరివిగా కొనుగోలు చేస్తున్నారని భారతి అంటున్నారు. మోడ్రన్ తల్లులు కూడా వీటి వైపే చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. తల్లి కలంకారీ చీర కానీ, డ్రస్ కానీ కొనుక్కుంటే.. అలాంటిదే వారి పాపకి గౌన్లు కుట్టిస్తున్నారని ఆమె తెలిపారు. అంటే తల్లీ- కూతుళ్లు ఒకే రకం దుస్తుల్లో మెరిసిపోతారనమాట. ఒక వేళ పాప కాకుండా బాబు అంటే.. అలాంటి చొక్కా ఒకటి కుట్టిస్తున్నారు.

కొందరు కంఫర్ట్ గా ఉండేందుకు కలంకారీ దుస్తులను ఎంచుకుంటుంటే.. మరి కొందరు ట్రెండ్ ఫాలో అవ్వడం కోసం ఈ దుస్తులను ధరిస్తున్నారు. ముఖ్యంగా నెమళి ఆకారంతో ప్రింట్ చేసిన దుస్తులను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరికొందరు సిల్క్ చీరకు కలంకారీ జాకెట్లను వాడటం ట్రెండీగా భావిస్తున్నారు.

మోసం చేస్తున్న వ్యాపారులు..

అయితే.. కలంకారీ వస్త్రాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో  పెట్టుకొని కొందరు దుకాణదారులు ప్రజలను మోసం చేస్తున్నారట. డూప్లికేట్ కలంకారీని చూపించి.. వాటినే నిజమైన వస్త్రాలుగా నమ్మించి అమ్మకాలు జరుపుతున్నారనే వాదనలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి  జాగ్రత్తగా పరిశీలించి మరీ కొనాలి.

కొనడంలోనే కాదు.. వీటిని వాడటంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని భారతి సూచిస్తున్నారు. ఈ వస్త్రాలను వేడి నీటితో కాకుండా చల్లని నీటితోనే ఉతకాలి. అదేవిధంగా మొదటిసారి వీటిని ఉతికేటప్పుడు డిటర్జెంట్ తో కాకుండా షాంపూతో వాష్ చేస్తే మంచిది. రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

అసలు కలంకారీ అంటే ఏమిటో తెలుసా?

కలం అనేది పర్షియన్‌ పదం. అంటే పెన్ను. కారీ అంటే పనితనం. కలంతో వేసే చిత్రం కాబట్టి దీనికి కలంకారీ అనీ, అలా వేసేవాళ్లను కలంకారులూ అనీ పిలిచేవారని చెబుతారు.  పూర్వం కళాకారులు, వూరూరా తిరుగుతూ రామాయణ, మహాభారత కావ్యాలనూ ఇతర పౌరాణిక కథనాలనూ మనసుకు హత్తుకునేలా చెప్పడంలో భాగంగా కథకు తగ్గ బొమ్మల్ని కలంతో వేసి వాటికి సహజరంగుల్ని అద్ది వాటి సాయంతో ఆ పురాణాన్ని వినిపించేవారు. అలా పుట్టినదే ఈ కలంకారీ కళ.

click me!