
పేద ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సులువైన మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం కనుక్కుంది. ఇకపై వారు తమ సమస్యలను అధికారులకు విన్నవించేందుకు ప్రతి ‘సోమ వారం’ జరిగే ప్రజావాణికై ఎదురుచూడాల్సిన అవసరం లేదు. పల్లెటూళ్లనుంచి ఆటోలు, బస్సులు పట్టుకుని కలెక్టరేట్లకు పరుగులు తీసే అవసరం లేకుండా ప్రజలను డిజిటలైజేషన్ దిశగా నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
స్రజలు అర్జీల పరిష్కారానికి మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు రావాల్సిన ఇబ్బందులు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘జనహిత’ ఆన్‌లైన్ సేవలకు ప్రారంభించనుంది. దీనిద్వారా బడుగు వర్గాలు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పనిదినాల్లో తమ సమస్యలు విన్నవించుకునేలా, సత్వర పరిష్కారం పొందేలా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
మొదట సూర్యాపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ‘జనహిత’ కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.అక్కడ స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి ‘జనహిత’ వెబ్‌పోర్టల్ సేవలను ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని కాల్ సెంటర్ నంబరు 94941 81920కు ఫోన్‌చేసి లేదా ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా ప్రజలు తమ ఆర్జీలను అందించవచ్చని ఆయన తెలిపారు.
తెలంగాణ అంతటా ఆగస్టు నుంచి ఈ సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం దొరికే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.