ఇబ్రహీంపూర్: ఒక క్యాష్ లెస్ విఫల ప్రేమ కథ

First Published Oct 13, 2017, 12:12 PM IST
Highlights
  • ఇబ్రహీంపూర్ గ్రామానికీ.. క్యాష్ లెస్ విధానానికి బంధం తెగిపోయింది.
  • స్వైపింగ్ మెషిన్లు మాకొద్దంటూ దండం పెడుతున్న వ్యాపారులు
  • పాత విధానానికే జై కొడుతున్న గ్రామస్థులు

గత ఏడాది డిసెంబర్ లో  పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ గుర్తండే ఉంటుంది. అంతా సులువుగా ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు ఎందుకంటే.. దేశంలో అంత అల్లకల్లోలం సృష్టించింది. డబ్బులు దొరకక ప్రజలు చాలానే అవస్థలు పడ్డారు. అదే సమయంలో.. తెలంగాణ లోని ఇబ్రహీంపూర్ అనే గ్రామం చాలా పాపులార్ అయ్యింది.

తెలంగాణ మంత్రి హరీష్ రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్..  తెలంగాణ లో మొట్టమొదటి క్యాష్ లెస్ విలేజ్ గా గుర్తింపు సాధించింది.  గ్రామంలోని వ్యాపారులందరూ స్వైపింగ్ మెషీన్లు పెట్టుకున్నారు. హోటళ్లలో కూడా మొబైల్ బ్యాంకింగ్ సేవలను తీసుకొచ్చారు. కేవలం రూ.500లోపు మాత్రమే నగదు చెల్లింపులకు అవకాశం ఇచ్చారు. 500 రూపాయలు ఎక్కువైతే కార్డు ద్వారానే చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. గ్రామంలోని అందరికీ అవగాహన కల్పించారు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లను గుర్తించి డెబిట్ కార్డులు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా దేశం చూపంతా ఈ గ్రామంపైనే పడింది. దేశంలో క్యాష్ లెస్ విలేజ్ గా మారిన రెండో గ్రామంగా అందరూ పొగడ్తల వర్షం కురిపించారు.

ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని.. ఇతర గ్రామాలు కూడా క్యాష్ లెస్ విలేజ్ గా మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆహా.. ఈ ఇబ్రహీంపుర్ గ్రామానికి స్వైపింగ్ మెషిన్లకు విడదీయరాని బంధం ఏర్పడింది అనుకునే లోపే అది ప్రేమ కాదు.. ఆకర్షణ అని తేలిపోయింది. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవ్వరూ క్యాష్ లెస్ విధానాన్ని పాటించడం లేదు. ఆ గ్రామంలోని దుకాణాదారులంతా..వారి వద్ద ఉన్న స్వైపింగ్ మెషిన్లను బ్యాంకులో అప్పగించేసి.. వాటికో దండం అని చెప్పేశారు. ఎందుకంటే.. ఆ మెషిన్లకు అదనంగా వారు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

గ్రామంలోని ప్రజలంతా ఇప్పుడు బ్యాంకుకు వెళ్లి.. డబ్బులు డ్రా చేసుకుంటన్నారు. ఏది కావాలన్నా డబ్బుతో కొనుక్కుంటున్నారట. ఇదే హాయిగా ఉంది మాకు అని వారు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్వైపింగ్ మెషిన్ల వల్ల తాను చాలా నష్టపోయానని చెబుతున్నాడు ఓ వ్యాపారి. గ్రామానికి చెందిన ప్రవీణ్ ఒక చిట్ ఫండ్ వ్యాపారి. క్యాష్ లెస్ విధానం అమలులోకి వచ్చినప్పుడు చిట్ ఫండ్ మనీ కూడా స్వైపింగ్ మెషిన్ తో చెల్లించమని ఆయన తన తోటి వారిని ప్రోత్సహించాడు. చివరికి.. ఆ మెషిన్ కి  బ్యాంకులో రూ.1400 రెంట్ కట్టాల్సి వచ్చింది. తనకు బ్యాంకు నుంచి రూ.50వేలు రవాల్సి ఉండగా.. కార్డు కారణంగా రూ.45వేలే వచ్చాయి. దీంతో ఆ మెషిన్ వాడటం ఆపేసానని చెబుతున్నాడు ప్రవీణ్.

ఇదే విషయాన్ని బ్యాంకులు  కూడా ఒప్పుకున్నాయి. ఆ గ్రామంలోని వ్యాపారులంతా స్వైపింగ్ మెషిన్లను వెనక్కి ఇచ్చేశారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆ మెషిన్లకు నెలకు రూ.1400 చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఆ మెషిన్లను థర్డ్ పార్టీ నుంచి హైర్ చేసుకున్నవని.. వాటికి వసూలు చేసే రెంట్ బ్యాంకులకు రాదని.,. ఆ థర్డ్ పార్టీకే చెందుతుందని వారు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఒక వ్యక్తి ఈ రోజు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే.. కార్డు ద్వారా మనీ చెల్లిస్తాడు. వాళ్లు చెల్లించిన డబ్బు తమకు మూడు రోజుల తర్వాత వస్తోందని.. ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందని మరో వ్యాపారి చెప్పడం గమనార్హం. ఇప్పుడు అక్కడ వ్యాపారులంతా కార్డు ద్వారా మనీ పే చేస్తామంటే.. వీరంతా ముక్త కంఠంగా ‘ సారీ’ అనేస్తున్నారు. డబ్బుతో లావాదేవీలే తమకు ప్రశాంతంగా ఉన్నాయని వారు చెప్పటం కొసమెరుపు. కనుక ఇక నుంచి ఇబ్రహీంపుర వెళితే.. కార్డుతో కాదు.. మనీ వెంట పెట్టుకొని వెళ్లండి. లేదంటే ఇబ్బంది పడతారు.

click me!