పెట్రల్ బంక్ కి వెళ్లాల్సిన అవసరంలేదు.. ఇంటికే పెట్రోల్, డీజిల్

First Published Mar 22, 2018, 11:32 AM IST
Highlights
  • డీజిల్ డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

బండిలో పెట్రోల్, డిజిల్ అయిపోతే ఏం చేస్తారు..? ఎవరైనా పెట్రోల్ బంక్ కి వెళ్లి కొట్టించుకుంటారు. ఇక ముందు ఆ అవసరం లేదు. మీ ఇంటికే వచ్చి మరీ పెట్రోల్, డీజిల్ ఇచ్చి వెళతారు. అదేనండి డోర్ డెలవరీ. కాకపోతే.. ఇది అమలు కావడానికి మరికొంత కాలం వేచి చూడాలి. ఇప్పటికే పూణెలో డీజిల్ డోర్ డెలివరీ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. త్వరలోనే దీనిని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. ఈ డోర్ డెలివరీ చేస్తున్నది కంపెనీ మరేదో కాదు.. దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

‘డోర్‌ డెలివరీ కింద డీజిల్‌ తీసుకొచ్చే విధానాన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా పుణెలో ప్రారంభించాం. ప్రజల నుంచి దీనికి మంచి స్పందన వస్తే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడు నెలల పాటు ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడతాం. పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(పీఈఎస్‌వో) దగ్గర నుంచి క్లియరెన్స్‌ పొంది ఇంటికే డీజిల్‌ వచ్చే సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి కంపెనీ మాదే’ అని కంపెనీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం డీజిల్ మాత్రమే సరఫరా చేస్తున్నామని , త్వరలోనే పెట్రోల్ కూడా సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన షాపింగ్‌ మాల్స్‌(డీజిల్‌ జనరేటర్‌), ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు, అత్యధికంగా డీజిల్‌ వినియోగం చేసే సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఐఓసీ మాదిరిగానే మరో రెండు చమురు సంస్థలు హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) కూడా పీఈఎస్‌వో క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే ప్రయోగాత్మకంగా పెట్రోల్‌, డీజిల్‌ ఇంటి వద్దకే సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

click me!