
శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిని సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం బాగానే వంటపట్టించుకున్నట్లు కనబడుతోంది. ఆయనకు చంద్రబాబునాయుడుపై ఉన్న కోపంతో తెలంగాణా సిఎం కెసిఆర్ ను పొగుడుతున్నారు కానీ నిజానికి ఇద్దరు సిఎంలకు పెద్దగా తేడాలన్నది వాస్తవం. మరి అంతలా పొగడటానికి కెసిఆర్ లో ముద్రగడకు ఏం నచ్చిందో ఏమో. కెసిఆర్ ను పొగుడుతు ముద్రగడ రాసిన లేఖపై ఇపుడు చర్చ జరుగుతోంది.
తెలంగాణాలో ఎన్నికలపుడు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను చాలా తక్కువ సమయంలో కెసిఆర్ అమలు చేసారట. మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాల్లో ఎన్ని అమలయ్యాయో టిఆర్ఎస్ మ్యానిఫెస్టోను ముద్రగడ దగ్గర పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. ఇక, గిరిజన, ముస్లిం సోదరులకు బిసి రిజర్వేషన్ల ఇచ్చిన విషయాన్ని ముద్రగడ ప్రస్తావించారు. ఇక్కడ ముద్రగడ గమనించాల్సిందేమంటే గిరిజన, ముస్లిం సోదరులకు కెసిఆర్ రిజర్వేషన్లు ఇచ్చేయలేదు. రేపో మాపో అమలూ చేయబోవటం లేదు.. రిజర్వేషన్ల శాతం పెంచాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారంతే. అసెంబ్లీ చర్చలోనే ప్రతిపక్షాలు లేవనెత్తిన ఏ ఒక్క సందేహానికీ కెసిఆర్ సమాధానం చెప్పలేకపోయిన విషయం ముద్రగడ దృష్టకి రాలేదేమో.
తెలంగాణా అసెంబ్లీ చేసిన తీర్మానంతో ఏమీ కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. రిజర్వేషన్ శాతం పెంచాలంటే పార్లమెంట్ ఆమోదించాలి, రాజ్యంగానికి సవరణలు చేయాలి, తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులవ్వాలి. గతంలో కూడా ముస్లింలకు రిజర్వేషన శాతాన్ని పెంచుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చేసిన నిర్ణయాన్ని కోర్టు కొట్టేసిన సంగతి కెసిఆర్కు తెలీదా? ఆ విషయాన్నిముద్రగడ మరచిపోయారా?
కాపులను బిసిల్లో చేర్చే అంశమూ కేవలం రాజకీయ హామీనే. ఇపుడు కెసిఆర్ చేస్తున్నదీ అదే అన్న విషయం ముద్రగడకు తెలీదా? ఖర్చుల్లేని ఎన్నికలు చేయటానికి కెసిఆర్ ప్రయత్నం చేయాలట. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధులే గెలవాలన్న ఉద్దేశ్యంతో సిఎంలిద్దరూ ఏం చేస్తున్నారో ముద్రగడ చూడటం లేదా? హామీలను అమలు చేయమని అడిగితే చంద్రబాబు లాఠీలతొ కొట్టించటం,అక్రమ కేసులు పెట్టి బాధిస్తున్నారట. తెలంగాణాలోనూ పరిస్ధితి భిన్నంగా ఏమీ లేదుకదా? ఏపిలో ప్రభుత్వంపై వైసీపీ పోరాటాలు చేస్తూంటే, తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు, భాజపాలు చేస్తున్న పోరాటాలు ముద్రగడ దృష్టికి రాలేదా?
ఇక, పదవులు, ఆస్తులు, జీవితాల విషయంలో కూడా ముద్రగడ కెసిఆర్ కు ఓ ఉచిత సలహా ఇచ్చారండోయ్. చంద్రబాబు కొడుకు లోకేష్ ను ఇపుడు మంత్రిని చేసారు. కాగా కెసిఆర్ కొడుకు, కూతురు విషయంలో ఎప్పుడో కట్టబెట్టిన విషయం ముద్రగడ మరచిపోయినట్లున్నారు. మొత్తం మీద ఇద్దరు సిఎంలు ఒకే తానుగుడ్డలమని అనిపించుకుంటుంటూ ముద్రగడకు మాత్రం కెసిఆర్లో ఓ దార్శినికుడు కనబటం విశేషమే.