విమాన ప్రయాణికులకు అతిపెద్ద శుభవార్త

First Published Apr 7, 2018, 10:21 AM IST
Highlights
విమాన ప్రయాణికులు భారీ పరిహారాలు

విమాన ప్రయాణికులకు ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త తెలియజేసింది.  ఇక నుంచి    విమానంలో లగేజీ పోయినా, విమానం రావాల్సిన టైమ్ కి రాకుండా ఆలస్యమైనా.. సదరు విమానయాన సంస్థ ప్రయాణికులకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈ మేరకు విమానయాన శాఖ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీంతో పాటు టికెట్‌ రద్దు చేసుకునే ఛార్జీలు కూడా తగ్గించి ప్రయాణికులకు ఊరట కల్గించనుంది.

విమానాలు ఆలస్యమైన లేదా రద్దయిన సమయంలో ప్రయాణికులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని విమానయాన శాఖ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు విమానాల్లో పోయిన లగేజీకి కూడా ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా  లేదా దెబ్బతిన్నా గరిష్ఠంగా రూ. 20వేల వరకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే రూ. లక్ష వరకు పరిహారం కింద ఇస్తున్నారు.

అయితే తాజాగా దీన్ని మరింత పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో పోయిన లగేజీకి కేజీకి రూ. 3000 వరకు చెల్లించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేగాక.. ప్రస్తుతం కొన్ని నిర్దేశిత కారణాల వల్ల విమానాలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఆ ఎయిర్‌లైన్‌లు పరిహారం చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కూడా పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది

click me!