గవర్నర్ నరసింహన్ ఉపరాష్ట్రపతి అవుతారా?

First Published Apr 3, 2017, 8:02 AM IST
Highlights

అంతా సవ్యంగా జరిగితే నాయుడు, కెసిఆర్ లతో ఉన్న అనుబంధం  వల్ల  రాజ్ భవన్ నుంచి గవర్నర్ నేరుగా  కొత్త ఢిల్లీ  నెంబర్ 6 , మౌలానా అజాద్ రోడ్ కు  మారవచ్చు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల గవర్నర్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న ఇఎస్ ఎల్ నరసింహన్ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నట్లుంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర-తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లాలతో పాటు ఇపుడు ఇఎస్ ఎల్ నరసింహన్ పేరుగా కూడా ఉపరాష్ట్రపతిపదవికి అర్హులని వినిపిస్తున్న వారి జాబితాలో చేరింది.

 

 రాష్ట్రపతి పదవికి ఉత్తరాది నేతను, అందునా ఆర్ఎస్ ఎస్ భావజాలంతో  సంబంధం ఉన్న వ్యక్తికి ఎంపిక చేయాలనుకుటున్ననేపథ్యంలో రాజకీయేతరుడిని ఉపరాష్ట్ర పతికి ఎంపిక చేయాలని బిజెపి నాయకత్వంలో ఒక ఆలోచన ఉన్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో నరసింహన్ పేరు ప్రచారంలోకి వచ్చింది.  బిజెపి నాయకత్వం తమిళనాడు  రాజకీయాల మీద ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తూ ఉండటం కూడా నరసింహన్ పేరు  బిజెపి ఉన్నత వర్గాల్లో చర్చకు వచ్చేందుకు కారణమయిందని బిజెపి వర్గాలు తెలిపాయి. ఈ చర్చ ఢిల్లీ బిజెపి వర్గాల నుంచి ఇపుడు అమరావతి తెలుగుదేశం వర్గాల్లోకి పాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ని ఉపరాష్ట్రపతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం టిడిపి వర్గాల్లో వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడే గవర్నర్ క్రిష్ణకాంత్ ని చంద్రబాబు ఉపరాష్ట్రపతి చేశారని ఒక టిడిపి వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

 

నరసింహన్ కు తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు తప్పక మద్దతు ప్రకటిస్తారని కూడా వారు చెబుతున్నారు.

 

ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తే,బిజెపి నాయకత్వం కాదనకపోవచ్చు. అందునా, యుపిఎ ప్రభుత్వంలో నియమితుడయిన నరసింహన్ ని 2014 తర్వాత కూడా బిజెపి కొనసాగించాలనుకోవడం, మూడేళ్లుగా రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగించేందుకు అంగీకరించడంతో  ఆయన  మీద బిజెపి నాయకత్వానికి ఏ మాత్రం వ్యతిరేకత లేదని అర్థమవుతుంది.

 

ఈ మధ్య  కెసిఆర్, చంద్రబాబు నాయుడు  గవర్నర్ కు విపరీతమయిన ప్రాముఖ్యం ఇస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంతగా చంద్రుల్లిద్దరు రాజ్ భవన్ సందర్శిస్తున్నారు.  దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణా ఏర్పడిన తర్వాత  రాజ్ భవన్ ప్రాముఖ్యం పెరిగింది.

 

ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ ఆశీస్సులను రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. మొన్న ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ సందర్భంగా  ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కుమారుడు  లోకేశ్ ని గవర్నర్ కు పాదాభివందనం చేయాలని పురమాయించారు.

 

ఇదంతా చూస్తే ఈ రెండు కుటుంబాలతో గవర్నర్ కు ఉన్న అనుబంధం అర్థమవుతుంది.

 

ఈ అనుబంధం వల్ల హైదరాబాద్ రాజ్ భవన్ నుంచి సులభంగా గవర్నర్ నేరుగా  నెంబర్ 6 , మౌలానా అజాద్ రోడ్ కు    వెళతారని అనుకుంటున్నారు.

 

ఉపరాష్ట్ర పతి హమీద్ అన్సారీ పదవికాలంలో ఈ ఏడాది ఆగస్టులో ముగియనుంది. 2012లో ఆయన రెండో ధఫా ఉప రాష్ట్రపతి అయిన సంగతి తెలిసిందే.

 

 

 

click me!