భారీగా ఉద్యోగాలు ఆఫర్ చేసిన కేంద్రం

First Published May 18, 2018, 2:15 PM IST
Highlights

కేవలం టెలికాం రంగంలో మాత్రమే

టెలికాం రంగంలో ఉద్యోగార్థులకు ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. రిలయన్స్‌ జియో టెలికాం రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.  జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా దిగొచ్చాయి. టారిఫ్‌లను తగ్గించాయి. మరోవైపు జియో రాకతో టెలికాం రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అయితే ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామంటోంది కేంద్ర ప్రభుత్వం. వారికి శిక్షణ ఇప్పించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టినట్లు టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్‌ తెలిపారు.

‘మూడు స్థాయిల్లో ఈ చర్యలు చేపట్టనున్నాం. ముందుగా రీటైల్‌ అవుట్‌లెట్లలో ఉద్యోగాలు కోల్పోయిన వారిపై దృష్టిపెడతాం. వీరికి కొత్త అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. పబ్లిక్‌ వైఫై, భారత్‌నెట్‌లో ఉద్యోగాలు అందించేలా చూస్తాం’ అని అరుణ అన్నారు. దీంతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారు మరో చోట ఉద్యోగం సాధించేలా తోడ్పాడు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం టెలికాం రంగంలోని నైపుణ్యాల మండలిని సంప్రదించినట్లు తెలిపారు.

జియో ఆగమనం తర్వాత టెలికాం రంగంలో దాదాపు 90వేల ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నష్టాలను తాళలేక కొన్ని టెలికాం కంపెనీలు దివాలా పిటిషన్‌ వేయగా.. మరికొన్ని కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశీయ రెండో అతిపెద్ద టెలికాం సంస్థ వొడాఫోన్‌, ఐడియాతో చేతులు కలిపింది. ఈ పరిణామాలు ఆయా సంస్థల్లోని ఉద్యోగులపై ప్రభావం చూపాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు సంస్థలు ఉద్యోగాల కోత బాటపట్టాయి.

click me!