జెయింట్ కిల్లర్, సిద్ధూకు చుక్కలు: ఎవరీ జీటీ దేవెగౌడ?

First Published May 15, 2018, 12:57 PM IST
Highlights

చాముండేశ్వరిలో ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత సిద్ధరామయ్యను ఓడించి జెడిఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ జెయింట్ కిల్లర్ గా అవతరించారు. 

మైసూరు: చాముండేశ్వరిలో ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత సిద్ధరామయ్యను ఓడించి జెడిఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ జెయింట్ కిల్లర్ గా అవతరించారు. నిజానికి, గతంలో దేవెగౌడ సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. సిద్ధరామయ్య ఆయనకు మార్గదర్శకుడు కూడా 

దేవెగౌడ స్వస్థలం గుంగరాలు ఛతర్. మాజీ మంత్రి, మూడు పర్యాయాలు శాసనసభ్యుడు కూడా. హన్సూరు, చాముండేశ్వరిల నుంచి ఆయన గతంలో శాసనసభకు ఎన్నికయ్యారు. 

వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శిగా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన 1978 ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి కెంపెగౌడకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయాల్లో తన ఉనికిని చాటుకున్నారు. 

కెంపెగౌడ ఇందిరా కాంగ్రెసు అభ్యర్థి డి. జయదేవరాజ్ ఉర్స్ చేతిలో ఓడిపోయారు. దీంతో అందరి దృష్టి దేవెగౌడపై పడింది. 1983లో సిద్ధరామయ్యతో ఆయన చేతులు కలిపారు. వారి మధ్య సాన్నిహిత్యం మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. 

జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన దేవెగౌడ్ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వా హున్సూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

ఆ తర్వాత సిద్ధరామయ్యకు దూరమై బిజెపిలో చేరారు. అనంతరం జెజిఎస్ లోకి వచ్చి 2013 ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి విజయం సాధించారు. 

తాను రాజకీయాల్లోకి రావడం అనుకోకుండా జరిగిందని, ఒకప్పటి మిత్రుడూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తాను పోటీ చేయాల్సి వస్తుందని అనుకోలేదని ఎన్నికలకు ముందు ఆయన అన్నారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో తాను 2006లో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు కూడా చెప్పారు. 

వరుణ నియోజకవర్గానికి మారిన తర్వాత సిద్ధరామయ్య చాముండేశ్వరి నాయకులతో సంబంధాలను కొనసాగించలేదని అంటారు. తన మిత్రులను పిలవడం గానీ చాముండేశ్వరిలో పర్యటించడం గానీ చేయలేదు.  

click me!