ఎపిసిసి అధ్యక్షుడి గా ‘మిస్టర్ క్లీన్ ఆంధ్ర’ ?

First Published Oct 28, 2017, 11:58 AM IST
Highlights

మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో మనోహర్ రంగ ప్రవేశం చేస్తే, అక్రమార్జన కేసులలో ఉన్న జగన్, ‘అక్రమాల పుట్ట’ మీద  కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులన మానసిక స్థయిర్యం దెబ్బతీయవచ్చునని పార్టీ యోచిస్టున్నట్లు సమాచారం.

 

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు వస్తున్నదా? రాష్ట్ర రాజకీయాలలో మిస్టర్ క్లీన్ గా పేరుతెచ్చుకున్ననాదెండ్ల మనోహర్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని కాంగ్రెస్ వర్గాల్లో నబడుతూ ఉంది. నాదెండ్ల మనోహర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ గా పనిచేశారు. రాష్ట్ర విడిపోయాక చాలా మంది పేరున్న కాంగ్రెస్ నాయకులు బతుకు దెరువు కోసం రూలింగ్ టిడిపిలోకో, బిజెపి లోకో, అపోజిషన్ వైసిపిలోకో వెళ్లినా, స్థిరంగాకాంగ్రెస్ లోనే నిలబడ్డ నాయకుడు మనోహర్. రెగ్యులర్ గా కాకపోయినా, ఆయన అపుడపుడు కాంగ్రెస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. స్పీకర్ గాఅసెంబ్లీ నడిపిన తీరుతో ఆయన అన్ని వర్గాల మన్ననలను పొందారు.  చిన్న వయసులో స్పీకర్ కుర్చీకి చాలా వన్నెతెచ్చారు. ఎపుడూ వివాదాల్లో ఇరక్కోలేదు. తాను వివాదాలు సృష్టించలేదు. బాగా చదవుకున్నవాడు. ఎపుడూ పుస్తకాలు చదువుతూ ఉంటారు. అందువల్ల నాదెండ్ల మనోహర్ కు రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించి, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని 24 అక్బర్ రోడ్ లో నలుగుతూ ఉందని పార్టీ  వర్గాలు ‘ఏషియానెట్’ కు వెల్లడించాయి.

మనోహర్  కు పిసిసి పగ్గాలు అప్పగించడం వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరతాయి. ఒకటి, ఒక కమ్మనాయకుడికి కాంగ్రెస్ నాయకత్వం అప్పగించినట్లవుతుంది. రెండు, మనోహర్ వైసిసి లోకి వెళ్లకుండా నివారించవచ్చు.

 ఆ మధ్య మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు వైసిసి నేత జగన్ ను బాగా ప్రశసించారు.  ఆయన చాలా ముందుకు వెళ్లి 2019 ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని కూడా చెప్పారు. దీనితో కాంగ్రెస్ లో అంత చురుకుగా లేని మనోహర్  వైసిసిలోకి జంపవుతారని అనుకున్నారు.  ఈ నవంబర్ లో చేరతారని కూడా కొంతమంది ముహూర్తం పెట్టారు.

 

నేపథ్యంలో  నాదెండ్ల మనోహర్ చర్చ మొదలయింది.

రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించగానే ఆయన  సొంత యంగ్  టీమ్ ఒకటి తయారువుతుందని, ఇందులో భాగంగా ఆంధ్రలో కాంగ్రెస్ ను పునరుద్ధరించేందుకు సరి కొత్త టీమ్ ను తయారవుతుందని చాలా మంది చెబుతున్నారు.  ఈ వ్యూహంలో భాగంగా నాదెండ్ల మనోహర్  కు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందని చర్చలు సాగినట్లు  ఈ వర్గాలు తెలిపాయి.

మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో మనోహర్ రంగ ప్రవేశం చేస్తే, అక్రమార్జన కేసులలో ఉన్న జగన్, ‘అక్రమాల పుట్ట’ మీద  కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మానసిక స్థయిర్యం దెబ్బతీయవచ్చునని పార్టీ యోచిస్టున్నట్లు సమాచారం. దీనికి తోడు మరొక బలమయిన  అంశం కూాడా ఉంది.  నాదెండ్ల మనోహర్ కమ్మ కులస్ధుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం చాలా ముఖ్యమయిన ఆయుధం కాబట్టి, కమ్మ అభ్యర్థి పిసిసి అధ్యక్షుడయితే  చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడంతో, కొంతమంది కమ్మలను ఆకట్టుకోవడం జరగవచ్చని కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి  కమ్మనాయకుడు అధ్యక్షుడు కాలేదు. కమ్మల ఆవేదన కూడా ఇదే.

రాష్ట్ర విభజన తర్వాత బిసి యాదవ కులానికి చెందిన రఘువీరారెడ్డిని ఎపిసిసి అధ్యక్షుడిగా నియమించారు. రఘువీరా పనితీరు మీద అధిష్టానం చాలా సంతృప్తిగా ఉందని, ఆయన చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్ ఉనికిని కాపాడాయని పార్టీగా గట్టిగా నమ్ముతూ ఉందని  కూడా ఈ వర్గాలు చెప్పాయి. అయితే, వ్యూహత్మకంగా యువకుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న విద్యావంతుడు అయిన మనోహర్ ను రంగంలో తీసుకురావడం వల్ల రాహుల్ టీం కు కొత్త రూపు వస్తుందని  పార్టీ నేతలు కొందరు సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో  ఏదో విధంగా మళ్లీ పార్టీకి బతికికించుకునేందుకు పార్టీలో పెద్ద చర్చ జరుగుతూ ఉందని, దీనికి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారని అంటున్నారు. 

తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, పార్టీని పటిష్టం చేసేందుకు వీలుగా టిపిసిసి  పునర్వ్యవస్థీకరించేందుకు ఆయనను తప్పించి  ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేశారు.

ఇదే విధంగా ఇపుడు ఆంధ్రలో పిసిసి పగ్గాలను నాదెండ్ల మనోహర్ కు ఇచ్చి 2019 ఎన్నికలకు సారధ్యం ఆహ్వానించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా  భావిస్తున్నారని తెలిసింది.

click me!