పవన్ ఇంత బాధపడ్తున్నది ఎందుకో తెలుసా?

First Published Dec 8, 2017, 1:45 PM IST
Highlights

 ప్రజల కష్టాలన్నింటికి  ప్రతిపక్ష  వైఫల్యమే కారణం

జనసేన నేత పవన్ కల్యాణ్ కు ప్రతిపక్ష పార్టీ వైసిపి మీద కుతికెలా దాకా కసి ఉంది. ఆయన గత రెండు రోజుల టూర్ లలో తప్పకుండా ప్రస్తావించింది ప్రతిపక్ష పార్టీ వైఫల్యం గురించే. వైసిపి నేత పేరు పెట్టి కొన్నిచోట్ల,  పేరెత్తకుండా కొన్ని సార్లు , ఈ పర్యటనలో ఆయన ప్రతిపక్ష పార్టీ విఫలమయిందని  చెప్పారు. ఇలా బాధపడకుండా, ఆవేదన చెందకుండా ఆయన ప్రసంగం ముగించలే. ఇపుడు తాజాగా ఫాతిమా కాలేజీ విద్యార్థుల విషయంలో కూడా ప్రతిపక్షపార్టీని లాగి వైఫల్యం అన్నారు.  ప్రభుత్వం ఫలానా పని చేయలేదు, ఫలానా విధంగా చేయాల్సి ఉండింది అంటూనే సమాన స్థాయిలో ఆయన ప్రతిపక్ష పార్టీని  వివాదంలోకి లాగుతూ వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక మాట అనాల్సి వచ్చినపుడల్లా ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష నేత జగన్ మీద రెండు రాళ్లు వేస్తూ వస్తున్నారు. బ్యాలెన్స్ చక్కగా మెయింటెన్ చేశారు. నేను ఏ పక్షం కాదు, జనం పక్షం అంటూ కొసమెరుపు కూడా తగిలిస్తూ వచ్చారు.

  ప్రభుత్వం  పోలవరం విషయంలో శ్వేతప్రతం విడుదలచేయాలంటూనే,  ఈ విషయంలో ప్రతిపక్షం ఫెయిలయిందన్నారు.  చంద్రబాబు మూడేళ్ల పాలన చూసి, ఇక ఉండబట్టలేక , కడుపు కాలి ప్రశ్నిస్తున్నానంటూనే,  పాదయాత్ర చేస్తూ ప్రతిపక్ష నేత చేస్తున్న  వాగ్దానాల విధానం పోవాలన్నారు. అసెంబ్లీ బహిష్కరించడం తప్పన్నారు.

ఈ  రోజు  తాజాగా ఆయన ఫాతిమా కాలేజీ విద్యార్థుల వ్యవహారాలలో కూడా ప్రభుత్వం వైఫల్యం కంటే ప్రతిపక్ష వైఫల్యం గురించే ‘చక్కగా’ మాట్లాడారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల  సమస్య మీద వారంరోజుల్లో మాట్లాడతానని, విద్యార్థులను రీలొకేట్ చేసేందుకు వారం రోజులు గడువుపెట్టారు. తాను పోరాటం చేస్తానని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చొరవ చూపి ఉంటే సమస్య పరిష్కారమయి ఉండేదన్నారు. ఆయన అన్నమాటలు  ఇవి : టిడిపి ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ప్రతిపక్షమైన వైసిపి అధికారపక్షాన్ని నిలదీయాలి.నేను జనం పక్షం..దేనికీ భయపడను. ఆడపిల్లల కన్నీటి శోకాలు రాష్ట్రానికి మంచిది కాదు.రాష్ట్ర ప్రభుత్వాన్ని , వైసిపి ని కోరుకునేది ఒక్కటే సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలి, ’ ఇలా ప్రతిచోటా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నపుడల్లా ప్రతిపక్షాన్ని కూడా లాగి బ్యాలెన్స్ మెయింటెన్ చేశారు.

ఇలాగే ఆయన కాంట్రాక్ట్ అధ్యాపకులు విషయంలో కూడా ప్రతిపక్షం పాత్ర మీద అసంతృప్తితో ఉన్నారు.‘మీరు దైర్యంగా ఉండండి’ అని అభయం ఇస్తూ  ‘ ఇతర పార్టీల నేతల మాదిరిగా అధికారంలోకి వస్తే చేస్తానని నేను చెప్పను..మీ సమస్యను అధికారుల దృ ష్టికి తీసుకెళ్లా’ నన్నారు.సిపిఎస్ విదాదంలో కూడా ఆయన ప్రతిపక్ష వైఫల్యం గురించి బాధపడ్డారు. ‘ప్రతిపక్షమైన వైసిపి ఈ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తక పోవడం బాధాకరం,’ అని తెగ బాధపడ్డారు.

‘జగన్ అయితే నేను ముఖ్యమంత్రి అవుతాను. అపుడు చెస్తానంటారు..అలా ఎవరు వచ్చినా అదేమాట చెప్తారు,’ అని జగన్ హామీలను కొట్టిపడేశారు.

 

 

 

click me!