ఖరీదైన గుండీలనే వజ్రాలుగా నమ్మించి మోసం

First Published Feb 1, 2018, 1:33 PM IST
Highlights
  • వజ్రాల పేరుతో షర్ట్ బటన్స్ అంటగడుతున్న నిందితులు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

కోట్ల విలువైన వజ్రాలను తక్కువ ధరకే అందిస్తామని వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువ చేసే వజ్రాలని చెబుతూ, ఖరీదైన వస్త్రాలకు వాడే గుండీలను అంటగడుతూ వ్యాపారులను మోసం చేస్తున్నారు నిందితులు. ఇలా మోసపోయిన  ఓ వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరిని  పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌కు చెందిన మహ్మద్‌ అథర్‌ సిద్ద్దిఖీ ముత్యాల వ్యాపారం చేస్తుంటాడు. మహ్మద్‌ సలాం ఖాన్‌ రామచంద్రాపురంలో నివాసముంటున్నాడు. వీరిద్దరూ కలిసి వ్యాపార లావాదేవీలు సాగిస్తూ స్నేహితులుగా మారారు. అయితే వీరు చేపట్టిన వ్యాపారాలన్ని నష్టాలబాట పట్టడంతో నష్టనివారణ కోసం నేరాలబాట పట్టారు. ఇందుకోసం వజ్రాల వ్యాపారులుగా మారి నఖిలీ వజ్రాలతో వ్యాపారులను మాయ చేసి వారి నుండి డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యేవారు.  ఇలా ఓ నఖిలీ వజ్రాన్ని సనత్ నగర్ కి చెందిన షేక్ హజీ కి అంటగట్టి 20 లక్షలు వసూలు చేసారు. అయితే ఈ వజ్రం నాణ్యతను తెలుసుకోడానికి ఓ వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లిన హజీ, దీన్ని నఖిలీ వజ్రంగా గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ ఫిర్యాదు తో రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వల పన్ని నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి  రూ.1.15 కోట్ల నగదుతో పాటు, వజ్రాలను పరీక్షించే పరికరాలు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆబిడ్స్‌ పోలీసులకు అప్పగించినట్లు సిటీ పోలీసు కమిషనర్‌ పీవీ శ్రీనివాసరావు వివరించారు. తక్కువ ధరకు వజ్రాలు, బంగారం, వెండి ఇస్తామని ఎవరైనా చెబుతున్నారంటే అది మోసం అని గ్రహించాలని కమిషనర్‌ ప్రజలకు సూచించారు.

click me!