
పోలవరం ప్రాజెక్టును 2019కల్లా పూర్తి చేస్తామని ఎంపీ రాయపాటి సాంబశివరావు పెద్ద జోక్ పేల్చారు. ఒకవైపు 2019 ఎన్నికల సమయానికి పోలవరం ప్రాజెక్టును కొంతమేరైనా పూర్తి చేసి.. దాని ద్వారా ప్రజలను ఓట్లు అడగాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇందుకోసం నానా అవస్థలు కూడా పడుతున్నారు. ఇలాంటి సమయంలో..అసలు ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైన రాయపాటే ఆ మాటలు చెబుతుండటంతో హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు నేతలు నవ్వుకుంటున్నారు.
అసలు కథేంటంటే.. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో.. పోలవరాన్ని జాతియ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. అంటే... ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలన్నింటినీ కేంద్రమే చూసుకోవాలి. అయితే.. చంద్రబాబు మాత్రం.. ఆ ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని.. కేంద్రం దగ్గర నుంచి లాక్కొన్నాడు. వాళ్లు కూడా ఆయన అడగగానే ఇచ్చేసారు. ఆ ప్రాజెక్టును తీసుకువచ్చి ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్ స్ట్రాయ్ సంస్థ చేతిలో పెట్టారు. నిజానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సామర్థ్యం ట్రాన్ స్ట్రాయ్ కు లేదు. కానీ పట్టుపట్టి మరి చంద్రబాబు ఆ సంస్థకే పనులు అప్పగించారు. తీరా చూస్తే అక్కడ పనులు జరుగుతున్న తీరు నత్తకు నడకలు నేర్పిన చందంగా ఉంది.
ఇదే కంటిన్యూ అయితే.. ఎన్నికల సమయానికి ప్రాజెక్టు పూర్తి కాదన్న విషయం చంద్రబాబుకి అర్థమైంది. దీంతో కాంట్రాక్టర్ మార్చుకునే అవకాశం ఇవ్వండి అంటూ కేంద్రాన్ని ఆయన కోరారు. ఈ విషయంలో కేంద్రం చంద్రబాబుకి పెద్ద షాకే ఇచ్చింది. కాంట్రాక్టర్ ని మార్చడానికి వీలు లేదని.. అంచనా వ్యయం పెరిగిపోతుందని అవి భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు దిమ్మ తిరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టుని ఎన్నికల స్టంట్ గా వాడుకోవాలన్న ఆయన కోరికకు ఆదిలోనే గండి పడింది. దీంతో ఎమిచెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు చంద్రబాబు. ఇక పోలవరం కాంట్రాక్టర్ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు తాజాగా చంద్రబాబు చెప్పాడు.
ఎటుతిరిగి ఇదంతా తన మెడకే చుట్టుకుంటుందని భావించాడో ఏమో రాయపాటి.. 2019కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పాడు. ఇన్నాళ్లు ఇసుమంత పని కూడా చేయించలేకపోయిన ఆయన.. సంవత్సరన్నర కాలంలో ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారు? అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రే పనులు అవ్వవు అని తేల్చి చెప్పిన తర్వత ప్రాజెక్టు పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ చెప్పడం జోక్ కాదా? తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోవడానికే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.