వైసీపీ తప్పటడుగు వేస్తోందా?

First Published Oct 24, 2017, 2:11 PM IST
Highlights
  • వైసీపీ తప్పటడుగు వేస్తోందా?
  • నవంబర్ 10వ తేదీ నుంచి శాసన సభ , శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి.
  • మొత్తం 10 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించాలని అనుకుంటోంది.
  • ఒక వేళ అదే నిజమైతే ప్రజల్లోకి రాంగ్ మెసేజీ వెళ్లే అవకాశం ఉంది కదా?

అసెంబ్లీ సమావేశాల విషయంలో వైసీపీ తప్పటడుగు వేస్తోందా? ఇప్పటికే సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్లు జనాల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. ఈ విషయంలో ప్రజల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. నవంబర్ 10వ తేదీ నుంచి శాసన సభ , శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించాలని అనుకుంటోంది. ఒక వేళ అదే నిజమైతే ప్రజల్లోకి రాంగ్ మెసేజీ వెళ్లే అవకాశం ఉంది కదా? ప్రజల సమస్యలను సభలో వినిపించి.. వారికి న్యాయం జరిగేలా చేయడం ఎమ్మెల్యేల బాధ్యత. ఆ బాధ్యత ప్రతిపక్ష పార్టీ పై కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాధ్యతను గాలికి వదిలేసి అసెంబ్లీ సమావేశాలకు గైర్హజరు కావడం సరైన నిర్ణయం సరైనదేనా?

అందులోనూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.. ఫిరాయింపు మంత్రులను బర్తరఫ్ చేయాలని  వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు అంగీకరించడం లేదనే ఆ పార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించాలనుకుంటున్నారు. అయితే.. వారి డిమాండ్ అర్థరహితం.  దీని వల్ల వైసీపీ ఒరిగే లాభం ఏమీ లేదు.

ఒక వేళ వారు ఏదైనా ప్రజా సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ.. సమావేశాలను బహిష్కరిస్తే.. దానిని ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా కేవలం  జగన్ మెప్పు కోసం సమావేశాలను బహిష్కరిస్తే ప్రజలు ఎలా హర్షిస్తారు? వీరికి ఓటు వేయడం వల్ల తమకు ఒరిగేదేమీ లేదు కదా? తమ సమస్యల కోసం పోరాటం చేయని వారికి ఓట్లు ఎందుకు వేయాలి.. అనే భావన ప్రజల్లో మొదలైతే? మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

వైసీపీ నేతలు సమావేశాలకు హాజరై.. టీడీపీ నేతలు వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే.. అప్పుడు తప్పు అధికార పార్టీది అవుతుంది. అలా కాకుండా వీరు అసలు సమావేశాలకు హాజరుకాకపోతే తప్పు కచ్చితంగా వైసీపీ నేతలదే అవుతుందనే వాదన వినపడుతోంది. కాబట్టి ఈ విషయంలో వైసీపీ పునరాలోచన చేసి శాసనసభా సమావేశాలకు హాజరైతే మంచిది.

click me!