
అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో రోహ్‌తక్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్మీత్ అనుచరులు విధ్వంసానికి పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అంతేగాక శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు కాల్పులకు కూడా వెనుకాడబోమని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. తీర్పు నేపథ్యంలో రోహ్‌తక్‌లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటుచేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గుర్మీత్‌ను ఉంచిన జైలుకు10 కిలోమీటర్ల వరకూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రోహ్‌తక్‌లో ఆందోళనలు చేపడితే వూరుకునేది లేదని డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ తెలిపారు. ‘చట్టాన్ని అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే ముందు వారిని హెచ్చరిస్తాం. అయినప్పటికీ వినకపోతే.. వారు బుల్లెట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అతుల్ హెచ్చరించారు. అత్యవసరమైన పనులుంటే తప్ప బయటివారు ఎవరూ నేడు జిల్లాకు రావొద్దని సూచించారు. అంతేగాక రోహ్‌తక్‌కు వచ్చేవారు వారి గుర్తింపుకార్డులను, స్పష్టమైన కారణాలను చెప్పాలన్నారు. లేదంటే వారిని అరెస్టు చేస్తామని అతుల్ అన్నారు.
న్యాయమూర్తి జగ్దీప్ సింగ్.. జైలు ప్రాంగణానికి హెలిప్యాడ్ లో రానున్నట్లు సమాచారం. శాంతి భద్రతల నేపథ్యంలో.. తీర్పు కోర్టు ప్రాంగణంలో కాకుండా.. జైలు ఆవరణలోనే వెలువరించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
గుర్మీత్ సింగ్ కి ఉరి శిక్ష వేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు ఉరిశిక్ష వేయాలంటూ పలువరు సాధువులు, బాధితులు ఆందోళన కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తీర్పు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతవారం గుర్మీత్ ని అరెస్టు చేసిన సమయంలో ఆయన అనుచరులు చేసిన విధ్వంస కాండలో 36మంది మృతి చెందగా.. 250మందికి పైగా గాయాలపాలైన సంగతి తెలిసిందే.