కేఈకి కోపం వచ్చింది..!

First Published Nov 27, 2017, 2:45 PM IST
Highlights
  • అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి కేఈ అసహనం
  • కేఈపై ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్యేలు

ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి కోపం వచ్చింది. అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. చేతిలోని పేపర్లను విసిరికొట్టారు. అసలు విషయం ఏమిటంటే... ఏపీ  అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంత్రులను అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నారు.

అయితే.. సోమవారం అసెంబ్లీలో రాష్ట్రంలోని అసైన్డ్‌ కమిటీల విషయంపై చర్చజరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్‌ చేశారు. అసైన్డ్‌ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం​ కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్‌మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా అని సభ్యులు నిలదీశారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే అసైన్డ్‌ కమిటీల సమాచారం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేల తీరుపై కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్‌ కమిటీలపై సమాచారం  తెప్పించుకొని ఆ తర్వాత చెబుతానని కేఈ సమాధానంగా చెప్పారు. ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు ఒక పట్టాన వదిలిపెట్టలేదు. ఒకరి తర్వాత మరొకరు ఒకే విషయంపై ప్రశ్నలు సంధించారు. దీంతో అసహనం చెందిన కేఈ  తన చేతిలో ఉన్న పేపర్లను బల్లకేసి కొట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ కమిటీల వ్యవహారం సీఎం చూసుకుంటారని చెప్పారు. ఆవిషయాలు సీఎంని అడగాలి కానీ తనని కాదన్నారు.

click me!