
‘ మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..’అన్నాడో మహా కవి. అదెంత నిజమో.. ఢిల్లీ యాక్సిడెంట్ బాధితుడి గోడు వింటే అర్థమౌతోంది. ఒక మనిషి ప్రాణాలను అరచేత పెట్టుకొని.. రక్తపు మడుగులో పడి ఉంటే.. చూస్తూ ఉండిపోయారే తప్ప.. కాపాడటానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పైగా అతని వద్ద ఉన్న బ్యాగు, జేబులో డబ్బులు దొంగిలించారు. ఈ అమానుష ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 35ఏళ్ల నరేంద్రకుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కుమార్ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దాంతో కుమార్ ఫుట్‌పాత్ మీద గాయాలతో రక్తం కారుతూ పడిపోయాడు. చేతులు, కాళ్లకు వెన్నుముకకు తీవ్రంగా గాయాలు కావడంతో కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. అటువైపుగా వెళ్తున్న పాదచారులు కుమార్‌ను చూసి కూడా చూడనట్టు సహాయం చేయకుండా వెళ్లిపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కుమార్ అలా దాదాపు పన్నెండు గంటల పాటు రోడ్డు పక్కనే పడి ఉన్నాడు. రాత్రివేళలో అతడి దగ్గర ఉన్న బ్యాగు, మొబైల్ ఫోన్, జేబులో ఉన్న రూ.12లను దోచుకున్నారు. ఒక వ్యక్తి మంచి నీళ్లు ఇచ్చాడు.. కానీ రూ.15వేలు ఉన్న బ్యాగును దొంగిలించేశాడు. చివరికి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో.. వాళ్లు వచ్చి కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు.
‘కారు వచ్చి తనను ఢీ కొట్టగానే.. నేను లేవలేని స్థితిలో పడిపోయాను.. కానీ ఏమి జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉంది. నేను స్పృహలోనే ఉన్నాను. చాలా మంది వచ్చి చూస్తున్నారే తప్ప ఎవరూ సహాయం చేయలేదు. చాలా మంది నేను మద్యం సేవించి పడిపోయాను అనుకున్నారు. హాస్పటల్ కి తీసుకువెళ్లమని చాలా మందిని బ్రతిమిలాడాను. అయినా ఎవరూ స్పందించలేదు’ అని కుమార్ మీడియాకు తెలియజేశాడు.