భలే చాన్సులే: ఫిరాయింపుల చట్టం వర్తించదని కేంద్రం

First Published May 17, 2018, 7:23 AM IST
Highlights

ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పార్టీ మారితే అది ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి రాదని ఎజి కెకె వేణుగోపాల్ వాదించారు.

న్యూఢిల్లీ: ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పార్టీ మారితే అది ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి రాదని ఎజి కెకె వేణుగోపాల్ వాదించారు. శాసనసభ్యులు పార్టీ మారడాన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం నిషేధిస్తుంది. అయితే, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పార్టీ మారే వరకు ఆ చట్టం వర్తించదని ఆయన అన్నారు.

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత కాంగ్రెసు, జెడిఎస్ ల తరఫున అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున కెకె వేణుగోపాల్ వాదించారు. 

ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను ప్రోత్సహిస్తే తప్ప కర్ణాటకలో బిజెపికి మెజారిటీ రాదని సింఘ్వీ అన్నారు. దాన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం చూసుకుంటుందని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. 

ఓ సభ్యుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారితే ఫిరాయింపు అవుతుందని, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు మారితే దానికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని వేణుగోపాల్ అన్నారు. 

అంటే ప్రమాణానికి ముందు ఎమ్మెల్యే ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లవచ్చునని అంటున్నారా అని కోర్టు ప్రశ్నించింది. కాంగ్రెసు- జెడిఎస్ వైపు 116 మంది సభ్యులున్నప్పుడు బిజెపి 112 సంఖ్యాబలాన్ని ఎలా సాధిస్తుందని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

యడ్యూరప్ప గవర్నర్ కు సమర్పించిన లేఖను తాము చూడలేదని, లెక్కలను బట్టి ఏ విధంగా ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడమేమిటి కోర్టు అన్నది. 

గవర్నర్ నిర్ణయాన్ని కోర్టు నిలువరించలేదని అంటూ కాంగ్రెసు పిటిషన్ ను కొట్టేయాలని కెకె వేణుగోపాల్ తో పాటు బిజెపి తరఫున వాదించిన ముకుల్ రోహత్గి కోరారు. గోవా వ్యవహారాలతో కర్ణాటకతో సంబంధం లేదని, గోవాలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు చెప్పుకోలేదని రోహత్గీ అన్నారు. 

click me!