
రాజ్ కోట్: గుజరాత్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ దళితుడిని కొట్టి చంపారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో కర్మాగారం యజమాని ఆదేశాల మేరకు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే జగ్నిషే మేవాని షేర్ చేశారు. బాధితుడిని ముకేష్ వానియాగా గుర్తించారు. తాళ్లతో కట్టేసి, అత్యంత కొట్టి కొట్టారు. బాధతో కేకలు పెడుతున్నా వినకుండా ఇద్దరు వ్యక్తులు కర్రలతో అతన్ని కొట్టారు. అతని భార్యను కూడా కొట్టినట్లు తెలుస్తోంది.
ఆ ఘటనకు వ్యతిరేకంగా మేవాని స్పందించి, దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఎస్సీ అయిన ముకేష్ వానియాను ఫ్యాక్టరీ యజమానులు దారుణంగా కొట్టి చంపేశారని, అతని భార్యను కూడా కొట్టారని మేవాని ట్వీట్ చేశారు.
#GujaratIsNot Safe4Dalits అనే హ్యాష్ టాగ్ ఇచ్చి దాన్ని షేర్ చేశారు. ఫ్యాక్టరీ యజమానితో పాటు ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వారిని అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసారు.
ఆదివారంనాడు ముకేష్ వానియా, అతని భార్య ఫ్యాక్టరీ వెలుపల అయస్కాంతంతో వ్యర్థ పదార్థాలను ఏరుకుంటున్నారు. కొంత మంది కార్మికులు వారితో గొడవకు దిగారు. దొంగతనం చేశారని వారు ఆరోపించారు.
ముకేష్ ను ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్ల కట్టేసి కొట్టారు. అతని భార్య మాత్రం పారిపోయి తన గ్రామానికి చేరుకుంది. కొంత మందిని వెంట పెట్టుకుని ఆమె తిరిగి వచ్చేసరికి భర్త నేలపై పడి ఉన్నాడు. అతన్ని అస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.