పోలవరాన్ని అడ్డుకుంటే చూస్తూ వూరుకోం

First Published Dec 11, 2017, 9:25 PM IST
Highlights
  • ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోంది.
  • ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తా

పోలవరం: ఆంధ్రపదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అడ్డుకుంటే చూస్తూ వూరుకోం అని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

 ప్రతి సోమవారం పోలవరంపై వర్చువల్  సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ రోజు ప్రాజెక్టును స్వత హాగా సందర్శించారు.  జనసేన నేత పవన్ కల్యాణ్ ,  వైసిపి ఎమ్మెల్యేల బృందం ఈ ప్రాజక్టును సందర్శించాక ముఖ్యంమంత్రి స్వయంగా ప్రాజక్టు సైట్ కు వచ్చి జరుగుతున్న పనులను సమీక్షించారు.

ఆయన విహంగ వీక్షణం ద్వారా కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ పనులను పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ లెక్కలు చెబుతుంటే ప్రాజక్టు మీద మళ్లీ శ్వేతపత్రం ఏమిటి,  ఎందుకు అని ప్రశ్నించారు. ‘ప్రాజెక్టును అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోం. అడ్డుకుంటే చూస్తూ వూరుకోం,’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై రూ.12,506 కోట్లు ఖర్చుచేశామని, కేంద్రం  రూ.4,390 కోట్లు బకాయీ ఉందని  గుర్తు చేశారు. ఇది కాక పవర్‌ ప్రాజెక్ట్‌కు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని అంటూ 2013 చట్టంతో భూసేకరణ  వ్యయం పది రెట్లు పెరిగిందని చెప్పారు. యూపీఏ తెచ్చిన చట్టం వల్లే పరిహారం ఖర్చు బాగా పెరిగిందని ఆయన అన్నారు.  ఆ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాలా వద్దా.. విపక్షాలు చెప్పాలన్నారు. ‘పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోంది.ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నాం,’ అని అన్నారు.

‘పోలవరం నిర్వాసితులకు ఉదారంగా కాదు బాధ్యతగా పునరావాసం కల్పిస్తామని, ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తా’మని చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరంలో కాంక్రీట్‌ వర్క్స్‌ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్‌ పనులు పూర్తిచేసి కాఫర్‌ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు.

98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వుంటుందని బాబు పేర్కొన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

click me!