
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎంత వేగంగా అంటే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిపైనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపేంతగా.
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలసి చెన్నైకు తిరిగి వచ్చిన వెంటనే రామ్మోహన్ పై ఐటి దాడులు జరగటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
జయలలిత మృతి తర్వాత ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు తీసుకున్నప్పటికీ అందుకు సెల్వం తెరవెనుక పెద్ద పోరాటాన్నే చేయాల్సి వచ్చింది. సెల్వం పోరాటం చేయాల్సి రావటానికి జయ నెచ్చెలి శశికళా నటరాజనే కారణం.
జయ తర్వాత సిఎం పీఠాన్ని అందుకోవాలని శశికళ ప్రయత్నించారు. అయితే, అప్పటికే రెండుసార్లు ఆపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సెల్వం తానే మూడోసారి కూడా సిఎం అవ్వాలని అనుకున్నారు.
అందుకు శశికళ అడ్డు వచ్చారు. దాంతో పార్టీ మద్దతు కూడగట్టేందుకు సెల్వం పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. అయితే మంత్రివర్గం, పార్టీ మొత్తం నాటకీయంగా శశికళకు మద్దతు తెలిపారు. దాంతో సెల్వం పేరుకు మాత్రమే సిఎంగా ఉన్నారు. దాంతో మళ్ళీ శశికళే తమిళనాడులో చక్రం తిప్పుతారంటూ ప్రచారం ఊపందుకుంది.
అటువంటి నేపధ్యంలోనే పన్నీర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానితో సమావేశమయ్యారు. మొన్నటి వరకూ తమిళనాడులో వేలు పెట్టేందుకు కూడా భారతీయ జనతా పార్టీకి జయలలిత అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడైతే జయ మృతిచెందారో తమిళనాడులో బలపడేందుకు భాజపా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అందుకనే వ్యూహాత్మకంగా అటు శశికళతోనూ ఇటు పన్నీర్ సెల్వంతోనూ ఏకకాలంలో మోడి సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. దాంతో భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయో అన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. సెల్వం సిఎంగా బాధ్యతలు తీసుకోగానే రాష్ట్రాన్ని వార్ధా తుఫాను అతలాకుతలం చేసింది. తుఫాను నష్టాలపై మాట్లాడేందుకు పన్నీర్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.
పన్నీర్-ప్రధాని భేటీలో తనకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు పన్నీర్ తగిన భరోసాను పొందారంటూ ప్రచారం మొదలైంది. అదే సమయంలో సెల్వం చెన్నైకు తిరిగి రాగానే రామ్మోహన్ ఇంటిపై ఐటి శాఖ దాడులు జరపటం గమనార్హం.
సెల్వం ఢిల్లీకి వెళ్ళిరావటం, రామ్మోహన్ ఇంటిపై ఐటి దాడులు జరగటం వెనుక పెద్ద కధే ఉందని సర్వత్రా చర్చ మొదలైంది. మొన్నటి వరకూ రామ్మోహన్ జయ, శశికళకు బాగా విశ్వాసపాత్రుడు. జయ ఆసుపత్రిలో ఉన్నంత కాలం ప్రధాన కార్యదర్శి పూర్తిగా శశికళ ఆదేశాల మేరకే నడుచుకున్నారని ప్రచారంలో ఉంది.
జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత కొంత కాలం రాష్ట్రానికి సిఎం లేకుండానే పాలన సాగింది. ఆ సమయంలో శశికళ, రామ్మోహన్ లే కీలక వ్యవహరాల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యసాగర్ రావు జోక్యం చేసుకునే వరకూ రాష్ట్రానికి ఆపధర్మ ముఖ్యమంత్రి కూడా నియమితులు కాలేదు.
చివరకు జయ నిష్క్రమణ తర్వాత పన్నీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నా రామ్మోహన్ మాత్రం ఇంకా శశికళ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలోనే ఐటి దాడులు జరగటం గమనార్హం. రామ్మోహన్ పై ఐటి దాడులు జరపటం శశికళ తదితరులకు కేంద్రం ఇచ్చిన వార్నింగ్ బెల్సా అనే చర్చ సర్వత్రా మొదలైంది.