డోంట్ వరీ, శేఖర్ రెడ్డికి ఏమీ కాదు

First Published Dec 16, 2016, 3:30 AM IST
Highlights

ఏడుకొండల వాడి సేవలో శేఖర్ రెడ్డి తరిస్తే,  శేఖర్ రెడ్డి సేవలో రిజర్వు బ్యాంక్ తరించింది

నిప్పులాంటి చంద్రబాబును మాయ చేసి టిటిడిలోకి దూరిన తమిళనాడు  కాంట్రాక్టర్   శేఖర్ రెడ్డికి కోట్లకు కోట్లు నోట్లు ఎలావచ్చాయనే దాని మీద జరుగుతున్న దర్యాప్తు ఎప్పటికయినా తేలుతుందా? రెడ్డి గారి దగ్గిర దొరికన కొత్త నోట్ల జన్మస్థానం ఎక్కడో వారం రోజులయినా కరెక్టుగా తేలడం లేదు. ఇందులోనే మతలబు వుంది.

 

కాబట్టి ఆయన అభిమానులు,సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు, రాజకీయ మిత్రులు చింతించాల్సిన అసవరం లేదు. రెడ్డి గారికేమీ కాదు.

 

అతగాడికి విశాఖ ఎస్‌బిఐ స్పెషల్‌ బ్రాంచ్‌ (చెస్ట్‌) నుంచే నగదు వెళ్లిందనేది కొంతమంది అధికారుల సమాచారం. పట్టించుకోవద్దండి.

 

 ఒక్కనోటుకే జనం కటకటలాడుతున్నపుడు శేఖర్ రెడ్డి ఇంట్ల పల పలలాడే కొత్త రెండు వేల నోట్లు ఒక లోడు దొరికాయి. ఇందులో 20 కోట్ల కరెన్సీ విశాఖనుంచి వెళ్లిందట. ఇలా లోడ్ల కొద్ది కరెన్సీ బ్యాంకు కౌంటర్ల నుంచి  కాకుండా ఒక అకౌంట్ హోల్డర్ కు ఏకంగా ట్రాన్స్ పోర్ట్ లో వెల్లడం గురించి భారతీయులు వినడం ఇదే ప్రథమం.

 

నోట్ల మీద ఉన్న సీరియల్ నంబర్ ల ప్రకారం ఇవి విశాఖ కు కేటాయించినట్లుగా గుర్తించారని వార్తలొస్తున్నాయి. అధికారికంగా అరుణ్ జైట్టీ కూడా ఏమీ చెప్పడం లేదు. ఇది ఎలా సాధ్యమో శేఖర్ రెడ్డి లేదా రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ చెబితే తప్ప తెలియదు. లేదా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పాలి.

 

 ఆర్థిక వేత్తలకు ఇలాంటి విషయాలు తెలియవు. నోట్ల నెంబర్ల ఆదారంగా అరగంటలో నిజానికి ఏ బ్యాంకు నుంచి ఎలా వెళ్లాయో చెప్పవచ్చు. ఒక ప్రకటన విడుదల చేయవచ్చు. అయితే, ఎవరూ చెప్పడం లేదు.  నోట్లు దొరికాయన్నారే తప్ప, అసలు విషయం బయటకు రావడం  లేదు.

 

మరొక వైపు ఈ కాంట్రాక్టర్ కు ఏకంగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచే కొత్త కరెన్సీ అందిందంటున్నారు. రెడ్డి గారికి  ఈ విషయంలొ ఒక డజను మంది అధికారులు సహకరించినట్లు చెబుతున్నారు. రు. 2 వేల నోట్లు ముద్రించే ప్రెస్ నుంచే నేరుగా నగదు అవి శేఖర్‌ రెడ్డి ఇంటికి చేరిందంటే ఆయన అసాధారణ  పలుకుబడిన ప్రశంసించాల్సిందే.

 

ప్రెస్‌ నుంచి నోట్లు ఆర్బీఐకి, అక్కడి నుంచి ఇతర బ్యాంకులకు పంపిణీ జరగాలి. అయితే లేట్ కాకుండా ఉండేందుకు నేరుగా కొత్త కరెన్సీని శేఖర్‌ రెడ్డికి పంపించారని చెబుతున్నారు.

 

ఏడుకొండల వాడి సేవలో శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి సేవలో రిజర్వుబాంకు తరిస్తున్నాయి.  ఇంత చూశాక శేఖర్ రెడ్డి కేసు చివరకు ఏమవుతుందో వేరే చెప్పనవసరంలేదు. ఆయనకు, ఆయనకు డబ్బుకి ఎలాంటి నష్టం జరుగదు. జరిగినా రిజర్వు బ్యాంకు మళ్లీ ప్రింటేసి ఇస్తుంది. అందుకే చంద్రబాబు కూడా ఆయనను శ్రీవారి సేవకు నియమించి ఉంటారు.

 

కనీసం బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్యవారైనా శేఖర్ రెడ్డికి నోట్లెలా వచ్చాయో చెబితె ప్రజలు సంతోషిస్తారు.

click me!