
భారతీయ జనతా పార్టీ ఎంపిల పరిస్ధితి ముందు నుయ్యి, వెనుకగొయ్యి లాగ తయారైంది. ప్రధానమంత్రి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి అనుకూలంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందిగా జాతీయ నాయకత్వం ఆదేశించింది. అయితే, ఎవరు కూడా ఇపుడున్న పరిస్ధితుల్లో ప్రజల్లోకి వెళ్లగలరా అన్నది పెద్ద ప్రశ్న.
అదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నసభలో ఎంపిలు లేవనెత్తారు. అయితే, వారి అనుమానాలను పట్టించుకోకుండా మోడి, అమిత్ షా ఎంపిలను ప్రజల్లోకి వెళ్ళాల్సిందేనని తేల్చారు. దాంతో ఎంపిల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది.
వెళ్లకపోతే ప్రధాని, అమిత్ షాలు తలంటుతారు. వెళితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. దాంతో ఏమి చేయాలో దిక్కు తెలీకుండా ఎంపిలు ఇపుడు అవస్తలు పడుతున్నారు.
నోట్ల రద్దు తర్వాత దేశం మొత్తం మీద నెలకొన్నఈ పరిస్ధితుల్లో ప్రధాని నిర్ణయానికి మద్దతుగా ప్రజల మధ్యకు వెళ్ళి మాట్లాడితే ఇంకేమన్నా ఉందా అంటూ ఎంపిలు సణుక్కుంటున్నారు. అసలు మోడి నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రజల్లో తిరిగే పరిస్ధితులున్నాయా అంటూ ఎంపిలు వారిలో వారు చర్చించుకుంటున్నారు.