మందుబాబులకు షాకింగ్ న్యూస్

First Published Apr 10, 2018, 10:01 AM IST
Highlights
పెరగనున్న బీర్ ధరలు

ఇటీవలే మద్యం ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం బీరు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. బీర్లపై ప్రస్తుతమున్న రేటును 12 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం ఫైనల్ పరిశీలనలో ఉంది. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ విభాగం లెక్కలు వేసుకుంది.
నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈసారైనా ధర పెంచాలని బ్రూవరీ కంపెనీలు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఒక్కో బీరుపై కనీసం రూ.6 చొప్పున బేసిక్‌ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి.  ఈ క్రమంలోనే ధరలపై సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. మూడు నెలల కిందటే రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీకి ధరలను సమీక్షించే బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతమున్న ధరలు, ఉత్పత్తిపై GST ప్రభావం అంచనాలను వేసిన కమిటీ.. 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్‌ విభాగం లేటెస్ట్ ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

సీఎం తీసుకునే నిర్ణయం మేరకు ధరల పెంపు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.  రాష్ట్రంలో బీర్ల వినియోగం ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు తాగుతున్నట్లు TSBCL నివేదికలున్నాయి. పోయిన సంవత్సరం ఎక్సైజ్‌ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ఎక్సైజ్‌ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం బడ్జెట్‌ లో అంచనాలు వేసుకుంది. బీర్ల ధరలు పెంచటం ద్వారా ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ధరల పెంపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు.

click me!