అంబటి రాయుడికి బీసీసీఐ షాక్

First Published Jan 31, 2018, 4:36 PM IST
Highlights
  • అంబటి రాయుడిపై నిషేధం విధించిన బీసీసీఐ

హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడుకి బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడని ఆరోపిస్తూ.. రాయుడిపై బీసీసీఐ రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. దీంతో అతడు త్వరలో ప్రారంభంకానున్న విజయ్‌ హజారే ట్రోఫీలో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ టోర్నీలో రాయుడు హైదరబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

జనవరి 11న హైదరాబాద్, కర్ణాటక మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఓ టీ20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కొట్టిన బాల్‌ను ఆపే ప్రయత్నంలో హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ కాలు బౌండరీకి తగిలింది. అది చూడకుండా అంపైర్లు కర్ణాటకకు రెండు పరుగులే ఇచ్చారు. చివరికి కర్ణాటక స్కోరు 203గా ప్రకటించారు.

అయితే ఇన్నింగ్స్ తర్వాత కర్ణాటక కెప్టెన్ వినయ్‌కుమార్ అంపైర్లతో వాదించి ఆ రెండు పరుగులు కర్ణాటక స్కోరుకు కలిపేలా చూశాడు. అయితే ఆ విషయం హైదరాబాద్ టీమ్‌కు తెలియలేదు. చివరికి హైదరాబాద్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 203 పరుగులు చేసి మ్యాచ్ టై అయినట్లుగా భావించినా.. అంపైర్లు మాత్రం కర్ణాటకను విజేతగా ప్రకటించారు. దీంతో కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లతో వాదనకు దిగాడు. దీంతో ఆ తర్వాత జరగాల్సిన మ్యాచ్ ఆలస్యమైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ.. రాయుడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.

click me!