‘ ది లీడర్ జగన్’ ఫేస్ బుక్ అడ్మిన్ పై కేసు

First Published Apr 16, 2018, 12:43 PM IST
Highlights
ఫేస్ బుక్ లో తప్పుడు వీడియో.. ఫైర్ అయిన పోలీసులు

ఫేస్ బుక్ లో తప్పుడు వీడియోలు, తప్పుడు సమాచారం పోస్టు చేసిన ‘ ది లీడర్ జగన్’ ఫేస్ బుక్ పేజీ అడ్మిన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లో అప్పుడెప్పుడో జరిగిన ఒక ఘటన వీడియోని విజయవాడలో జరిగిందంటూ ప్రచారం చేశారు. 


జగన్‌ పాదయాత్రకు వెళుతున్న యువకులపై విజయవాడ పోలీసుల దౌర్జన్యం అంటూ తప్పుడు వీడియోను ఫేస్‌బుక్‌ పేజీల్లో పెట్టారు. దీనిపై విచారణ అనంతరం అది తప్పుడు వీడియోగా పోలీసు అధికారులు తేల్చారు. ది లీడర్‌ జగన్‌ నిర్వాహకులే దీనికి కారణమంటూ పోలీసుల విచారణలో తేలింది. దీనిపై స్పెషల్‌బ్రాంచి సీఐ యువకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారనే అభియోగాలు మోపి ఆయా సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. సదరు ఫేస్‌ బుక్‌ పేజీ నిర్వాహకుడి గురించి ఆరా తీస్తున్నారు.


కాగా... పోలీసు కేసు అవ్వడంతో సదరు ఫేస్ బుక్ పేజీ అడ్మిన్ జాగ్రత్తపడ్డాడు. పేజీలోని వీడియోని తొలగించాడు. పొరపాటున అవి విజయవాడలో జరిగిందని భావించినట్లు తన పేజీలో పోస్టు చేశాడు.

click me!