
తుతికొరిన్: వేదాంత స్టెరిలైట్ కాపర్ యూనిట్ కు వ్యతిరేకంగా గత నెల రోజులుగా జరుగుతున్న ఆందోళన మంగళవారంనాడు హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలికతో పాటు 11 మంది మరణించారు. ఆందోళనకారులు కలెక్టరేట్ కు నిప్పు పెట్టారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎస్పీ క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. రెండోసారి పోలీసులు కాల్పులు జరిపారు.
మృతదేహాలని తూతుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ వైపు దూసుకుపోతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. 144వ సెక్షన్ విధించారు. ఆందోళనకారులు ర్యాలీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిని తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు.
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ వదిలారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.