
మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి సరైన ఉదాహరణ శక్తి అనే పన్నెండేళ్ల కుర్రాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శక్తి.. గిరిజన కుటుంబానికి చెందిన దాదాపు 20మంది పిల్లలను స్కూలుకి వెళ్లేలా ప్రేరేపించాడు. దీంతో శక్తి.. ఈ ఏడాది అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. ఈ బహుమతికి నామినేట్ అయిన.. అతి పిన్న వయస్కుడు శక్తి నే. గతంలో ఈ అవార్డును పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ అందుకున్నారు.
శక్తి..తిరువన్నమలై ప్రాంతంలోని నరికురివార్ జాతికి చెందిన కుర్రాడు. మొదట స్కూల్ కి వెళ్లినప్పుడు.. టీచర్లు, తోటి విద్యార్థులు అతనిపై వివక్ష చూపించేవారు. దీంతో అది తట్టుకోలేని శక్తి.. ఒకానొక సమయంలో స్కూల్ కి వెళ్లడం ఆపేశాడు. అంతేకాదు తన కుటుంబానికి సహాయం చేయాలని అడక్కోవడం, రోడ్ల మీద పూసల దండలు అమ్మడం లాంటి పనులు కూడా చేశాడు.
అయితే.. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఎన్జీవో ఈ కమ్యూనిటీని గుర్తించింది. ఆ కమ్యూనిటీకి చెందిన చిన్నారులందరినీ పాఠశాలకు పంపించాలని.. ఇందుకోసం తమ సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రాం పెడుతోందని.. దానికి పిల్లలను పంపాలని ఆ సంస్థ కోరింది. దీనికి చాలా మంది అంగీకరించలేదు. కానీ.. శక్తి , మరికొందరు పిల్లలు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చేరారు.
ఆ ట్రైనింగ్ వెళ్లి వచ్చిన దగ్గర నుంచి శక్తిలో చాలా మార్పు వచ్చింది. తనతోపాటు.. తన చుట్టుపక్క ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచడం ప్రారంభించాడు. అక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కటీ తన ఇంట్లోనే అమలు చేయడం మొదలుపెట్టాడు.
శక్తిని చూసి.. వారి కమ్యునిటీకి చెందిన వారిలో మార్పు వచ్చింది. దీంతో వాళ్లు కూడా వారి పిల్లలను పాఠశాలలో చేర్పించారు. దాదాపు 20మంది పిల్లలు.. శక్తి కారణంగా బడి బాట పట్టారు.దీంతో శక్తిని ఈ ఏడాది అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఈ ఏడాది మొత్తం 169మంది నామినేట్ కాగా.. వారిలో అందరికన్నా చిన్నవాడు శక్తి కావడం విశేషం.