
Yogi Cabinet 2.0: యూపీ సిఎం ఆదిత్యనాథ్ నూతన మంత్రులకు శాఖాలను కేటాయించారు. గత శుక్రవారం లక్నోలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం యోగితో పాటు డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం తొలుత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా సభలో ప్రమాణ స్వీకారం చేశారు. విపక్ష నేత కూడా అయిన అఖిలేష్ సైతం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రి ప్రమాణస్వీకారం చేయించారు.
తదనంతరం.. కొత్తగా చేరిన మంత్రులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాఖలను కేటాయించారు. గత శుక్రవారం లక్నోలో జరిగిన ప్రమాణస్వీకర కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు డిప్యూటీ సీఎంలు గా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం యోగి, హోంతోపాటు 24 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ బ్రజేష్ పాఠక్‌కు వైద్య, విద్య శాఖను కేటాయించారు.
మరో యాభై మంది ఎమ్మెల్యేలను క్యాబినెట్ మంత్రులుగా, రాష్ట్ర మంత్రిగా మరియు స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీరతు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మౌర్య డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కేశవ్ ప్రసాద్ మౌర్యకు రూరల్ డెవలప్‌మెంట్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కేటాయించారు. సురేష్ ఖన్నాకు ఆర్థిక,పార్లమెంటరీ వ్యవహారాలు శాఖను అప్పజేప్పగా.. స్వతంత్ర దేవ్ సింగ్ కు జల్ శక్తి, అలాగే..బేబీ రాణి మౌర్య కు మహిళా,శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు.
పేదలు, రైతులు, యువత , మహిళల సాధికారత కోసం బిజెపి ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంపై దృష్టి సారించినట్టు సీఎం యోగి తెలిపారు. ఈ మేరకు తమ మొదటి బడ్జెట్‌లో రూ. 6.5 లక్షల కోట్లకు పైగా కేటాయింపు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
అలాగే.. నేడు ఎక్సైజ్, ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సీఎం యోగి సమావేశమయ్యారు. పార్టీ మేనిఫెస్టోను దృష్టిలో ఉంచుకుని కొత్త బడ్జెట్‌ను రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.
యోగి ప్రభుత్వం యొక్క రాబోయే బడ్జెట్ సుపరిపాలన, భద్రత,అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని, రాష్ట్రాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ఉంటుందని CMO ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న బడ్జెట్ లో పేదలు, రైతులు, కార్మికులు, యువత, మహిళల సాధికారతపై దృష్టి సారిస్తుంది. బీజేపీ వరుసగా రెండోసారి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 255 సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షాలతో కలిసి 273 సీట్లను కైవసం చేసుకుంది.