అల్లోపతిలో ఆ వ్యాధులకు చికిత్స లేదు.. ఆవుపాలతో ఆయుర్వేదంతోనే వాటికి చెక్.. రాందేవ్ బాబా

By SumaBala BukkaFirst Published Mar 21, 2023, 7:37 AM IST
Highlights

రాందేవ్ బాబా అల్లోపతి వైద్య విధానం మీద మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆవు పాలతో అన్ని రోగాలు నయమవుతాయని అన్నారు. 

హరిద్వార్ : యోగ గురువు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అల్లోపతి విధానంలో కొన్ని రకాల వ్యాధులకు చికిత్స లేదని.. ఆయుర్వేద వైద్యంతోనే వాటిని సమూలంగా నిర్మూలించవచ్చని అన్నారు. మధుమేహం, క్యాన్సర్,  అధిక రక్తపోటు లాంటి వ్యాధులకు అల్లోపతిలో చికిత్స లేదని వ్యాఖ్యానించారు. ఆవుపాలతోనే చాలా రోగాలు నయమవుతాయని చెప్పారు. రోగనిరోధక శక్తి ఆవుపాలతోనే పెరుగుతుందని అన్నారు. అంతేకాదు తన సంస్థలు ఆయుర్వేద ఔషధాలు, గోమూత్రం కలయికతో క్యాన్సర్ లాంటి  చికిత్స లేని వ్యాధులను  నయం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలను ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ సదస్సులో చేశారు. హరిద్వార్ లో ఉన్న రిషికుల్ ఆయుర్వేద కాలేజీలో ఈ సదస్సు నిర్వహించారు.

ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ లో కూడా ఇలాంటి వ్యాఖ్యలతోనే వివాదాస్పదం అయి.. చివరికి క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకునే  రాందేవ్ బాబా  మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ యోగా గురువు  మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు  దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.  ఆయన మీద   కఠిన చర్యలు తీసుకోవాలి అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో యోగా గురు రాందేవ్ బాబా ఆ వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు చెప్పుకొచ్చారు.  

మహిళలను కించపరచడం, అవమానించడం తన ఉద్దేశం కాదని అని.. అలాంటి ఆలోచన తనకు లేదని…తాను చేసిన  వ్యాఖ్యలతో.. ఎవరికైనా బాధ కలిగితే  తనను క్షమించాలని  రాందేవ్ బాబా కోరారు. గత వారం ఓ సందర్భంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ..  దుస్తులు వేసుకోకపోయినా మహిళలు  అందంగానే ఉంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రాందేవ్ బాబాకు దీనిమీద నోటీసులు జారీ చేసింది. దీంతో రాందేవ్ బాబా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల మీద క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకాంకర్ ట్విట్టర్ లో  తెలిపారు. తన పోస్టుకు రాందేవ్ బాబా రాసిన లేఖను కూడా  జతచేశారు.

‘సమాజంలో మహిళలు  గౌరవప్రదమైన  స్థానంలో ఉండాలని  నేను కోరుకుంటాను. ఆ ఉద్దేశంతోనే మహిళల సాధికారత కోసం  నేను ఎల్లప్పుడూ  కృషి చేస్తూ ఉంటాను. అందుకోసమే.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కూడా నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరపరిచేలా అన్నా ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు.  ఆ వీడియో  పూర్తిగా నిజం కాదు. అయినా కూడా..  నావల్ల ఎవరైనా బాధపడితే..  బాధ పడిన వారికి నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని రాందేవ్ బాబా తనకు వచ్చిన నోటీసులకు బదులుగా సమాధానమిచ్చారు.

అసలేం జరిగిందంటే.. అంతకుముందు మహారాష్ట్రలోని ఠానేలో ముంబై మహిళా పతంజలి యోగా సమితి, పతంజలి యోగా పీఠ్ లు సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవీస్ తో సహా అనేకమంది మహిళలు హాజరయ్యారు.యోగా శిక్షణ కార్యక్రమం తరువాత ఒక ప్రత్యేకత సమావేశం కూడా జరిగింది. దీంతో యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు.. వాటిని మార్చుకునే అవకాశం దొరకలేదు. ఇది గమనించిన రాందేవ్ బాగా ఆ పరిస్థితిపై స్పందించారు. స్త్రీలు ఎలా ఉన్నా అందంగానే ఉంటారని,  చీరల్లో, సల్వార్ సూట్ లలోనే కాదు… తనలాగా అసలేం వేసుకోకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆయన అన్న మాటలకు మహిళలు ఇబ్బంది పడ్డారు. వెంటనే ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

click me!