
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మహిళలు, వారి వస్త్ర ధారణపై నోరు జారడంతో వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మైక్ అందుకుని మహిళల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ మహిళలు చీరలో బాగుంటారు, సల్వార్ సూట్స్‌లో కూడా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా కంటికైతే అసలేం ధరించకపోయినా అందంగానే కనిపిస్తారంటూ’’ బాబా రాందేవ్ వ్యాఖ్యలు చేశారు.
ఏకంగా ఉప ముఖ్యమంత్రి భార్య , ఇతర ప్రముఖులు, వందలాది మంది మహిళల సమక్షంలో బాగా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు, మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. తక్షణం మహిళా లోకానికి బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాబా రాందేవ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. యోగా సైన్స్ శిబిరానికి మహిళలు యోగా డ్రస్సుల్లో వచ్చారు. అదే రోజు శిబిరం, యోగా శిక్షణా కార్యక్రమం జరగడంతో వారు చీరలు ధరించేందుకు సమయం లేకపోయింది. ఈ పరిస్ధితిపై మాట్లాడాలనుకున్న బాబా రాందేవ్ ఏదో చెప్పాలనుకుని, ఇలా నోరు జారారు.
Also Read:సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. ఆర్యన్ ఖాన్, ఆమీర్ ఖాన్, ఇంకా..: రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇకపోతే.. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో భాగంగా గత నెలలోనూ బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘షారూఖ్ ఖాన్ కొడుకు (ఆర్యన్ ఖాన్) డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ చేస్తూ దొరికాడు. ఆయన జైలుకు వెళ్లాడు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. ఆమిర్ ఖాన్ గురించి నాకు తెలియదు. ఈ యాక్టర్లు అందరి గురించి దేవుడికే తెలియాలి’ అని మొరదాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో వ్యాఖ్యానించారు.
‘ఎంత మంది సినీ స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారో ఎవరికి తెలుసు. హీరోయిన్లు మరీ దారుణం. సినిమా పరిశ్రమలో ఎటు చూసినా డ్రగ్స్, రాజకీయాల్లోనూ డ్రగ్సే’ అని తెలిపారు. ‘ఎన్నికల్లో లిక్కర్ ను పంచుతారు. అందుకే భారత్ ఎలాంటి డ్రగ్ బానిసత్వం నుంచి అయినా సరే దూరంగా ఉండాలనే శపథం తీసుకోవాలి. ఇందుకోసం మేము అంతా కలిసి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’ అని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు.