
వచ్చే ఏడాది ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి, మరోసారి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. గెలిచాక మళ్లీ మళ్లీ వస్తామని ప్రతి ఒక్కరూ చెబుతుంటారని ఖర్గే అన్నారు. కానీ గెలుపు ఓటములు ప్రజల చేతుల్లో, ఓటర్ల చేతుల్లోనే ఉన్నాయని అన్నారు. ‘‘ అవును.. వచ్చే ఏడాది మరోసారి మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. కానీ తన ఇంట్లోనే ఆ పని చేస్తారు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
2023లోనే 2024లో మరోసారి జెండా ఎగురవేస్తానని అనడం అహంకారం అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే ఉంటే దేశాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. 2024 ఎన్నికల్లో ఎవరు తిరిగి వస్తారో, ఎవరు రాకూడదో దేశ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. దాని కోసం కనీసం 2024 వరకైనా వెయిట్ చేద్దామని తెలిపారు.
ఇంతకీ ప్రధాని ఏం అన్నారంటే ?
ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అందులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘2019లో పనితీరు ఆధారంగా మీరు నన్ను మరోసారి ఆశీర్వదించారు. రాబోయే ఐదేళ్లు అపూర్వమైన అభివృద్ధి కోసం, 2047 కలను సాకారం చేసుకోవడానికి రాబోయే ఐదేళ్లు అతిపెద్ద సువర్ణ క్షణం. వచ్చేసారి ఆగస్టు 15న ఈ ఎర్రకోట నుంచి దేశం సాధించిన విజయాలు, అభివృద్ధిని మీ ముందు ఉంచుతాను.’’ అని అన్నారు.
ఇదిలావుండగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, బీఆర్ అంబేడ్కర్, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లకు నివాళులు అర్పిస్తూ వీడియో సందేశాన్ని షేర్ చేశారు. అందులో అటల్ బిహారీ వాజ్ పేయిని కూడా ఆయన ప్రస్తావించారు.
‘‘నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని బాధతో చెబుతున్నాను. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కొత్త అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడమే కాకుండా ఎన్నికల కమిషన్ ను కూడా నిర్వీర్యం చేస్తున్నారు.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీలను అణచివేస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, మైకులను మ్యూట్ చేస్తున్నారని, ప్రసంగాలను తొలగిస్తున్నారని ఆయన తన వీడియో సందేశంలో మండిపడ్డారు.